
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము వ్యతిరేకమని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం (ఏప్రిల్ 1, 2026) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. తాము అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దేశంలో అతి పెద్ద స్కామ్‌కు అమరావతి రాజధానిగా మారిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు కేవలం తన స్కాముల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. రాజధాని విషయంలోనే కాదని, ఏ విషయంలోనైనా చంద్రబాబులో ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికాలిటీ అనేది కనిపించదని, అది ఉండి ఉంటే ఇప్పటికే రాజధాని నిర్మాణం అయి ఉండేదన్నారు. రాజధానిలో చంద్రబాబు దోపిడీ మొత్తం బయటకు వస్తుందని, ప్రతి పనిలో ఎంత దోపిడీ చేసిందీ త్వరలోనే ప్రపంచానికి తెలుస్తుందన్నారు.
దోపిడీని ప్రశ్నించకూడదా..
అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లోనూ చంద్రబాబు హైలెవల్ కరప్షన్‌కు పాల్పడ్డారని జగన్ ఆరోపణలు చేశారు. అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాలువలైనా, సివరేజి ప్లాంట్లైనా అవినీతిమయంగా మారాయన్నారు. కేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసమే రూ.401 కోట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఫ్లై ఓవర్ కోసమే కిలోమీటర్‌కు రూ.170 కోట్లు పెడుతున్నారని అన్నారు. తమ హయంలో విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌కు కిలోమీటర్‌కు రూ.35 కోట్లు పెట్టామని గుర్తు చేశారు. మిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారని, నేషనల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదా అన్నారు. అడిగితే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయి..
చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లను ఎప్పుడు పెట్టగలుగుతారని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా, బాధ్యతగా చేయాల్సిన మంచి ఎలా జరుగుతుందని అన్నారు. ఉద్యోగస్తులకు రూ.36వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. 2018లో ఏ పనులు ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తరువాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణి జరిగిందని, మాఫియాగా ఏర్పడ్డారని అన్నారు. స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు అప్పులు చేస్తున్నారని, అప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయిందని అన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని జగన్ వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో అమరావతి తీర్మానం ఒక డ్రామా అని, రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అన్న పదమే లేదని తెలిపారు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతేనని స్పష్టం చేశారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.













