నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక యాక్షన్ డ్రామా ఎన్‌బీకే111 నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఎంతో హుందాగా, అదే సమయంలో అధికారాన్ని ప్రతిబింబించే లుక్‌లో కనిపించింది. చెక్స్ చీర, కళ్లజోడుతో దర్శనమిచ్చిన ఆమె బ్యాక్‌డ్రాప్‌లో ప్రభుత్వ కార్యాలయ వాతావరణం కనిపిస్తోంది. దీంతో కథలో కీలక ప్రాధాన్యం కలిగిన శక్తివంతమైన, ప్రభావవంతమైన పాత్రను కాజల్ పోషిస్తున్నట్లు పోస్టర్ ద్వారా సంకేతాలు లభిస్తున్నాయి.
1993 బాంబే నేపథ్యంలో..
ఇటీవల విడుదలైన ఎంట్రీ ఆఫ్ అన్ఎరా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. 1993 బాంబే నేపథ్యంలో బాలకృష్ణ పాత్రను ఎంతో తీవ్రతతో పరిచయం చేసిన ఆ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఎన్‌బీకే111 ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మంచు మనోజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆకట్టుకోని అఖండ 2..
సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, సాయి మాధవ్ బుర్ర సంభాషణలు రాస్తున్నారు. కాగా బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మొదటి పార్ట్ అంత ప్రభావవంతంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. అఖండ 2 సినిమాలో అనేక లాజిక్ లేని సీన్లు, అతిపై ప్రేక్షకులు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.

స్పందించండి