డిజిటల్ యుగంలో అన్ని రంగాల్లోనూ ఎక్కడ చూసినా కంప్యూటర్లు, ఫోన్లు ఉపయోగంలో ఉన్న నేపథ్యంలో పేపర్లు, పెన్నులు వంటి స్టేషనరీ వాడకం చాలా వరకు తగ్గి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ దేశంలోని ప్రముఖ బ్యాంకులు మాత్రం స్టేషనరీ కోసం ఏటా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గ్రో తాజాగా ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో ఈ వివరాలను వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో పలు బ్యాంకులు స్టేషనరీ ఖర్చుల కింద కొన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశాయని గ్రో నివేదిక వెల్లడించింది. అందులో రూ.986.4 కోట్లతో ఎస్‌బీఐ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక రూ.922.5 కోట్ల స్టేషనరీ వ్యయంతో ప్రైవేటు బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఏటా ఈ బ్యాంకులు తమకు వస్తున్న ఆదాయంలో వరుసగా 1.22, 1.26 శాతాన్ని స్టేషనరీ ఖర్చులకే వినియోగిస్తుండడం గమనార్హం.
ఏయే బ్యాంకులు ఎంతెంత..?
గ్రో విడుదల చేసిన జాబితాలో యాక్సిస్ బ్యాంకు మూడో స్థానంలో ఉండగా, తరువాతి స్థానంలో ఐసీఐసీఐ నిలిచింది. ఈ బ్యాంకులు వరుసగా రూ.373.8 కోట్లు, రూ.318.5 కోట్లను 2025 ఆర్థిక సంవత్సరంలో స్టేషనరీ కోసం ఖర్చు చేశాయి. ఆ మొత్తాలు ఆయా బ్యాంకులకు వచ్చిన ఆదాయాలలో వరుసగా 1.33, 0.58 శాతాలుగా ఉన్నాయి. ఇక ఆ తరువాతి స్థానంలో రూ.211.9 కోట్ల వ్యయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలవగా, ఈ బ్యాంకు తమకు లభిస్తున్న ఆదాయంలో స్టేషనరీ కోసం 1.02 శాతం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.173.8 కోట్లు (0.94 శాతం), కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.167 కోట్లు (0.75 శాతం), కెనరా బ్యాంక్ రూ.165.9 కోట్లు (0.94 శాతం), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.135.3 కోట్లు (0.75 శాతం), ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ.122.7 కోట్లు (8.05 శాతం), ఇండస్ ఇండ్ బ్యాంక్ రూ.114.9 కోట్లు (4.46 శాతం), యెస్ బ్యాంక్ రూ.70 కోట్లు (2.86 శాతం), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రూ.58.3 కోట్లు (2.77 శాతం), ఫెడరల్ బ్యాంకు రూ.56.2 కోట్లు (1.33 శాతం) ఖర్చులతో వరుస స్థానాల్లో నిలిచాయి.
How much do Banks spend on Pen & Paper?
(Costs for FY25) pic.twitter.com/OViC5vd8Bl
— Groww (@_groww) June 17, 2026
శాతం ప్రకారం ఐడీఎఫ్‌సీ టాప్..
ఆదాయంలో స్టేషనరీ కోసం ఖర్చు చేస్తున్న మొత్తం శాతాన్ని బట్టి చూస్తే ఈ జాబితాలో 8.05 శాతంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలవగా, తరువాతి స్థానంలో 4.46 శాతంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ నిలిచింది. ఆ తరువాత యెస్ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నిలిచాయి. అంటే ఈ బ్యాంకులు తమకు వస్తున్న వార్షిక ఆదాయంలో కేవలం స్టేషనరీ కోసమే అంత శాతంలో మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతుండగా అన్ని చోట్లా వీలైనంత తక్కువగా పేపర్‌ను వాడాలని పర్యావరణ వేత్తలు నొక్కి చెబుతున్నారు. బ్యాంకులు సైతం ఏటీఎం సెంటర్లలో రశీదులను ప్రింట్ చేసే సమయంలో, ఇతర పత్రాలపై పర్యావరణాన్ని రక్షించాలని సూక్తులు చెబుతుంటాయి. కానీ వాస్తవం మాత్రం వేరేగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషనరీ కోసం అంత భారీ మొత్తంలో ఎందుకు ఖర్చు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో బ్యాంకులను ట్రోల్ చేస్తున్నారు. అయితే జాబితాలో అగ్ర స్థానంలో నిలిచిన ఎస్‌బీఐ ఇంకా ఎక్కువ విమర్శలను ఎదుర్కొంటుండడం వైరల్‌గా మారింది.

స్పందించండి