సమంత ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం మా ఇంటి బంగారం జూన్ 19 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆమె తన భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులు స్వామివారిని దర్శించుకుని మా ఇంటి బంగారం సినిమా ఘన విజయం సాధించాలని పూజలు చేశారు. చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి, యాంకర్ శ్రీముఖి కూడా వారితో కలిసి తిరుమల దర్శనం చేసుకున్నారు. సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజ్‌కు తిరుపతి ప్రాంతంతో బలమైన అనుబంధం ఉండగా, ఆసక్తికరంగా మా ఇంటి బంగారం కథ కూడా ఇదే ప్రాంత నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సాగుతుంది.
ఈ దంపతులకు ఈ సినిమా ప్రత్యేకం..
కాగా ఈ చిత్రం ఈ దంపతులకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ త్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా, రాజ్ నిడిమోరు షోరన్నర్‌గా వ్యవహరించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే రూపకల్పనలో కూడా కీలకంగా సహకరించారు. సినిమా విడుదల అయిన వేళ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషంగా మారింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలనే ఆశాభావంతో చిత్ర యూనిట్ స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.
ప్రేక్షకుల ఆసక్తి..
రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న అనంతరం రిలీజ్ అవుతున్న సమంత తొలి సినిమా ఇదే కాగా, ఇందులో పలు యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే ట్రైలర్, టీజర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అమాయకురాలిగా కనిపించే ఓ గృహిణి వెనుక ఉండే ఫ్లాష్ బ్యాక్, ఆమె ఏం చేసేది, ఎందుకు ప్రస్తుతం అలా ఉంది.. అన్న కోణంలో సినిమా అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. చాలా రోజుల తరువాత సమంత మళ్లీ వెండితెరపై కనిపిస్తుండడంతో ఆమె అభిమానులు సైతం సినిమాను వీక్షించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

స్పందించండి