భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భవిష్యత్తులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్‌ను దాదాపు మూడు వారాలు ముందుకు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది. తీవ్రమైన ఎండలు, ప్రీ-మాన్సూన్ వర్షాల ప్రభావాన్ని నివారించేందుకు 2027 సీజన్ నుంచి టోర్నీని మార్చి 10 నుంచి మే 15 మధ్య నిర్వహించాలని ఆలోచిస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పీటీఐతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ ప్రతిపాదనపై బోర్డు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2027లో ఐపీఎల్ 20వ ఎడిషన్ జరగనున్న నేపథ్యంలో ఈ మార్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సాధారణంగా ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివర్లో ముగుస్తుంది. అయితే మే 15 తర్వాత పలు ప్రాంతాల్లో ప్రీ-మాన్సూన్ వర్షాలు ప్రారంభమవడం, అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని సైకియా పేర్కొన్నారు.
కారణాలు ఇవే..
ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28 ప్రాంతంలో ప్రారంభమై మే 31న ముగిసిందని, మే 15 తర్వాత వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని సైకియా అన్నారు. అదే సమయంలో వేడి కూడా ఆటగాళ్లు, ప్రేక్షకులకు అనుకూలంగా ఉండదని చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్‌మెంట్) అబ్బే కురువిల్లాకు మార్చి 10 నుంచి మే 15 వరకు టోర్నీ నిర్వహించే అవకాశాలపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సైకియా వెల్లడించారు. ఆటగాళ్లు, అభిమానులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనుకుంటున్నామని, ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భారత్‌లోని తీవ్ర ఎండలకు పూర్తిగా అలవాటు పడరని, అలాగే దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడి కారణంగా ప్రేక్షకుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 74 నుంచి ప్రతిపాదిత 94కు పెంచే అంశంపై కూడా చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుతం అది సాధ్యం కాదని సైకియా స్పష్టం చేశారు.
విదేశీ ప్లేయర్ల ప్రయోజనాలను గౌరవించాలి..
రెండు నెలల ప్రత్యేక విండోనే సాధించడం కష్టంగా ఉందని, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఇతర దేశాల క్రికెట్ కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఐపీఎల్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రయోజనాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఇతర దేశాల ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా అంతర్జాతీయ టోర్నీలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశం బీసీసీఐకి లేదని స్పష్టం చేశారు. అయితే మ్యాచ్‌ల సంఖ్య పెంపును పూర్తిగా తోసిపుచ్చకపోయినా, సమీప భవిష్యత్తులో మాత్రం అలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐపీఎల్‌ను ముందుగా ప్రారంభించాలంటే దేశీయ క్రికెట్ క్యాలెండర్‌లో కూడా మార్పులు అవసరమవుతాయని సైకియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశీయ సీజన్ ఇరానీ కప్ తో ప్రారంభమై, రంజీ ట్రోఫీ ఫైనల్‌తో మార్చిలో ముగుస్తోంది.
మార్చి 10 నుంచే నిర్వహించేలా..
దేశీయ టోర్నీల షెడ్యూల్‌ను కొంత కుదించాల్సి రావచ్చని సైకియా అన్నారు. మార్చి 10 నాటికి అన్ని దేశీయ పోటీలు ముగిసేలా చేస్తే, వెంటనే ఐపీఎల్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అలాగే 2026 ఐపీఎల్ విజయవంతంగా ముగియడంపై సైకియా సంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ టోర్నీని ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు.

స్పందించండి