ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల హాసన్ వంటి అగ్ర నటీనటులు ప్రధాన పాత్రల్లో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రం రెండో భాగంలో పలు కీలకపాత్రలను తప్పించనున్నారనే వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఆయన తెరకెక్కించిన కల్కి మొదటి భాగం సూపర్ హిట్ అయింది. అందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించగా, ఆమెను తప్పిస్తూ ఇది వరకే నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రెండో భాగంలో సాయిపల్లవి నటిస్తుందని చెప్పారు. అయితే దీపికా పదుకునె నటించిన కీలకమైన సుమతి పాత్రలోనే సాయిపల్లవిని నటింపజేస్తారా, మొదటి భాగంలో నటించిన కొందరిని రెండో భాగంలో తీసేస్తారా.. అని ఇటీవలి కాలంలో వార్తలు వస్తున్నాయి. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఆ వార్తలను ఖండించారు. పాత్రలను తొలగించడం ఉండదని, అయితే ఎవరు నటించాలి, సాయి పల్లవి పాత్ర ఏమిటి అనే విషయాలపై ఇంకా తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.
సుమతిగా ఎవరు..?
కాగా కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ హీరోగా నటించినా, భవిష్యత్తులో కల్కిగా అవతరించబోయే శిశువును గర్భంలో మోసే సుమతి పాత్రలో దీపిక కనిపించింది. ప్రస్తుతం కల్కి 2 చిత్రీకరణ సాగుతుండగా, రెండో భాగంలో దీపిక కనిపించదని తేలిపోవడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారు అని ఆసక్తి నెలకొంది. రెండో భాగం మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని స్పష్టమవుతుండగా, అందులో ఎవరిని నటింపజేస్తారు అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ సస్పెన్స్‌గానే ఉంచారు. దీపిక ఆ పాత్రకు సరిగ్గా సెట్ అయినా ఆమె నిర్మాతలతో ఏర్పడిన విభేదాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తోంది. అయితే అత్యంత కీలకంగా మారిన సుమతి పాత్ర గురించే ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సుమతి పాత్ర ఉండదా..?
కొందరు సాయిపల్లవి ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉందని చెబుతుండగా, మరికొన్ని కథనాలు ఆ పాత్రనే రెండో భాగంలో తొలగించే అవకాశముందని పేర్కొన్నాయి. ఈ ప్రచారాలపై తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ స్పందించారు. తాము నిర్ణయం తీసుకుంటామని, సుమతి పాత్రను తొలగించే అవకాశం లేదని, ఎందుకంటే కల్కి జన్మించాల్సి ఉందని, కథ అంతా అతని గురించే ఉంటుందని ఆయన తెలిపారు. అయితే సాయి పల్లవి నటించే అవకాశాన్ని ఆయన ఖండించలేదు. అదే సమయంలో ఆమె ఎంపికపై స్పష్టమైన ధ్రువీకరణ కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై చిత్రబృందం సరైన సమయంలో అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్, ప్రభాస్ అవసరం లేని సన్నివేశాల చిత్రీకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాల్గొనే పలు సన్నివేశాలను పూర్తి చేసినట్లు సమాచారం. వీరు మొదటి భాగంలో పోషించిన యాస్కిన్, అశ్వత్థామ పాత్రలను మళ్లీ కొనసాగిస్తున్నారు.

స్పందించండి