గురువారం, జూన్ 11, 2026
వినోదం

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.
ముంబైలో వాయు నాణ్యత క్షీణించడంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన దీపికా పదుకొనె. Photo Credit: Deepika Padukone/Instagram.
Deepika Padukone voicing concern about Mumbai air quality index.
ముంబైలో వాయు నాణ్యత క్షీణించడంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన దీపికా పదుకొనె. Photo Credit: Deepika Padukone/Instagram.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీపికా పదుకొనె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ముంబై నగరానికి సంబంధించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) డేటాను పంచుకున్నారు. ఆమె షేర్ చేసిన చిత్రంలో ముంబైలో సగటు AQI సుమారు 150గా ఉన్నట్లు కనిపించింది. ఆ చిత్రంపై ఆమె కామెంట్ కూడా పెట్టారు. ఈ నగరం, ఇక్కడి పిల్లలు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎలా సరిగ్గా ఉంటుంది, సహాయం చేయండి.. అని క్యాప్ష‌న్ పెట్టారు. కాగా గతేడాది నుంచి ముంబైలో వాయు నాణ్యత స్పష్టంగా క్షీణిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ నుంచి వెరీ పూర్ స్థాయిలకు చేరుకుంది. అందులో భాగంగానే దీపికా ప‌దుకొనె స్పందించారు.

భ‌వ‌న నిర్మాణ పనులే ప్ర‌ధాన కార‌ణం..

2026 ఫిబ్రవరిలో నగరవ్యాప్తంగా AQI స్థాయిలు సుమారు 230 నుంచి 250 మధ్య నమోదయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), ఘట్కోపర్, ములుంద్ వంటి ప్రాంతాల్లో AQI స్థాయి దాదాపు 290 వరకు నమోదై సివియర్ కేటగిరీకి చేరువైంది. ముంబైలో AQI క్షీణించడానికి ప్రధాన కారణాలలో ఒకటి భారీ స్థాయిలో జరుగుతున్న పునర్నిర్మాణ, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల వల్ల ఉత్పత్తి అయ్యే దుమ్ము అని తేలింది. తవ్వకాలు, కూల్చివేత పనులు, నిర్మాణ వ్యర్థాల రవాణా, అలాగే కప్పకుండా ఉంచిన నిర్మాణ సామగ్రి కారణంగా గాల్లో PM10, PM2.5 కణాల పరిమాణం గణనీయంగా పెరుగుతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇవే ముంబైలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

అధికారుల‌కు హైకోర్టు హెచ్చ‌రిక‌లు..

అధికారులు కూడా.. నియమాలను పాటించకుండా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి ముఖ్య కారణమని అంగీకరించారు. దీనికి ప్రతిస్పందనగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) దుమ్ము నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణ ప్రాజెక్టులకు వందల సంఖ్యలో షోకాజ్ నోటీసులు, పనులు నిలిపివేయాలనే ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యంపై చర్యల్లో భాగంగా ముంబైలో 1వేయికి పైగా నిర్మాణ ప్రాజెక్టులకు స్టాప్-వర్క్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యపై న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయి. వాయు కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యారని బాంబే హైకోర్టు పౌర అధికారులను విమర్శించింది. వాయు నాణ్యతకు సంబంధించిన ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి