గురువారం, జూన్ 11, 2026
వినోదం

నిజజీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు.. జగపతిబాబు ఓపెన్ కామెంట్స్..

సినిమాల్లో మాత్రమే నటిస్తానని, నిజజీవితంలో కూడా నటిస్తూ బతకాల్సిన అవసరం తనకు లేదని ప్రముఖ నటుడు జ‌గ‌ప‌తిబాబు స్పష్టం చేశారు. అందుకే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నానని తెలిపారు.

నిజజీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు.. జగపతిబాబు ఓపెన్ కామెంట్స్..
తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు జగపతిబాబు. Photo Credit : Jagapathi Babu/Social Media/X.

సినిమాల్లో మాత్రమే నటిస్తానని, నిజజీవితంలో కూడా నటిస్తూ బతకాల్సిన అవసరం తనకు లేదని ప్రముఖ నటుడు జ‌గ‌ప‌తిబాబు స్పష్టం చేశారు. అందుకే ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నానని తెలిపారు. ఇటీవల పెద్ది చిత్రంలో అప్పలసూరి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, సినిమా విడుదల అనంతరం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పుడు కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో తనకు గుర్తింపు వచ్చిందని, ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. వివిధ హీరోలతో కలిసి నటించడం కూడా అందుకు కారణమని పేర్కొన్నారు. తన కెరీర్‌ లేదా వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలోనూ పశ్చాత్తాపం లేదని, కోల్పోయిన విషయాల గురించి ఆలోచించనని అన్నారు.

నిజం చెప్పి కూడా బ‌త‌కొచ్చు..

జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుందని చెప్పిన జగపతి బాబు, అబద్ధాలు చెప్పని మనిషి ఎవరూ ఉండరని అన్నారు. జీవితంలో తాను ఎప్పుడూ అబద్ధం చెప్పలేద‌ని ఎవరైనా చెబితే అదే పెద్ద అబద్ధమ‌ని అన్నారు. నిజం చెప్పి కూడా బతకొచ్చని తెలుసుకున్న తర్వాతే నిర్మొహమాటంగా మాట్లాడుతున్నాన‌ని అన్నారు. అనవసరంగా నిజాలు దాచడం, ప్రతిదానికి అబద్ధాలు చెప్పడం ఎందుకని ప్ర‌శ్నించారు. నిజజీవితంలో కూడా నటించాల్సిన అవసరం లేద‌ని అన్నారు.

ట్రోలింగ్‌ను ప‌ట్టించుకోను..

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ, తనను ట్రోల్ చేయడానికి నెటిజన్లకు చాలానే అవకాశాలు వచ్చినప్పటికీ ఇతరులతో పోలిస్తే తక్కువగానే ట్రోల్ చేశారని చెప్పారు. ఒకసారి తాను చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఏడుస్తున్న ఫొటోను ఉపయోగించి వీడియోలు చేసిన ఘటనను గుర్తు చేశారు. అయితే అలాంటి ప్రచారాలను తాను పట్టించుకోనని, అవి పనిలేని వాళ్లు చేసే పనులేనని పేర్కొన్నారు. తనకు నచ్చిన విధంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నానని జగపతి బాబు తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి