మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తోడేళ్లలా మారి రాష్ట్రం మీద పడ్డారని, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి మళ్లీ పదవులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆరోపించారు. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు త్యాగాలు చేశామని చెబుతుంటారని, త్యాగాలు చేయడం అంటే రాజీనామాలు చేయడం, ఎన్నికలు తేవడం, వసూళ్లకు పాలడ్పడమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు చేసింది త్యాగమైతే కొండా లక్ష్మణ్ బాపూజీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీకాంతచారి చేసింది ఏమనాలని అడిగారు.
త్యాగాలు ఉద్యమకారులకు, పదవులు బీఆర్ఎస్ నేతలకు: రేవంత్ రెడ్డి
తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే, మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష చేశారని, వందల మంది త్యాగాలు చేసి తెలంగాణను సాధించారని, ఆ త్యాగాలను బీఆర్ఎస్ నేతలు తమ ఖాతాల్లో వేసుకుంటున్నారని మండిపడ్డారు. పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టె తెచ్చుకోని వాళ్లు త్యాగాల గురించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఆయన పరోక్షంగా విమర్శించారు. ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించారని, పదవులను మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు పదవులను అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించారని ఎద్దేవా చేశారు.
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అనేక హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఫించన్లు, రేషన్ కార్డులు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సంక్షేమ పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ ఆపలేదని, ప్రజా శ్రేయస్సు, అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

స్పందించండి