సోమవారం, జూన్ 15, 2026
తెలంగాణ

మీనాక్షి నటరాజన్‌కు రేవంత్ రెడ్డి వెన్నుపోటు.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు వెన్నుపోటు పొడిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌పై తప్పుడు కేసు పెట్టించారని, ఆమె రేవంత్ రెడ్డి భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.

మీనాక్షి నటరాజన్‌కు రేవంత్ రెడ్డి వెన్నుపోటు.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు..
హైదరాబాద్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్. Photo Credit: BRS Party/X.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి న‌ట‌రాజ‌న్‌కు వెన్నుపోటు పొడిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌పై తప్పుడు కేసు పెట్టించారని, ఆమె రేవంత్ రెడ్డి భూ వ్యవహారాలు, కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్, మీనాక్షి నటరాజన్‌పై సృష్టించిన ఈ తప్పుడు కేసు వివరాలను రేవంత్ రెడ్డి బీజేపీకి చేరవేశారని ఆరోపించారు. దీంతో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆమె నామినేషన్ దాఖలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. తన సొంత పార్టీ నాయకులనే వెన్నుపోటు పొడిచే వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు. నిజాయితీ క‌లిగిన నాయకురాలు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన మీనాక్షి నటరాజన్ రేవంత్ కక్షసాధింపు రాజకీయాలకు బలయ్యారని పేర్కొన్నారు.

హిట్ల‌ర్ వ్యాఖ్య‌ల‌పై ఖండ‌న..

హిట్లర్ తన ఆదర్శమని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను పూర్తిగా ఫ్లాప్ సినిమాగా అభివర్ణించిన కేటీఆర్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సినిమా ట్రైలర్ చూస్తే హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా తెలుస్తుందన్నట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. మొదటి రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఒక్క ప్రధాన హామీని కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ప్రశ్నించారు. అలాగే నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రూ.4 వేల భృతి కూడా అందించలేదని ఆరోపించారు.

మ‌హిళ‌ల సంక్షేమం విష‌యంలోనూ విఫ‌లం..

మహిళల సంక్షేమ హామీల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఒక కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేశామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ విసిరారు. అది నిజమని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రతి లబ్ధిదారురాలికి ప్రభుత్వం రూ.1.25 లక్షలు బాకీ పడిందని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక తప్పదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధిక్కరించి దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారని, అందువల్ల ఉపఎన్నిక అనివార్యమవుతుందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో అనుమానాస్పద ఓట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఓటరు జాబితాల్లో కాంగ్రెస్ జోక్యంపై పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలని, అలాగే డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి