పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఓజీకి సీక్వెల్‌గా ప్రకటించిన ఓజీ 2 అభిమానులతోపాటు సినీ వర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు పవన్ కళ్యాణ్ నటనకు దూరమవుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్న సమయంలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చిన ఓజీ 2 టీజ్ అందరికీ ఊహించని సర్‌ప్రైజ్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు సుజిత్ తాను ముందుగా అనుకున్న బ్లడీ రోమియో ప్రాజెక్ట్ కంటే ముందుగా ఓజీ 2 ని పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం పవన్ కళ్యాణ్, సుజీత్ మధ్య జరగనున్న కీలక సమావేశం సానుకూలంగా ముగిసి, పవన్ ఊహించిన దానికంటే ముందుగానే డేట్స్ కేటాయిస్తే, ఈ చిత్రం 2026 నవంబర్‌లోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలో సుజీత్ వెంటనే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని వారాల్లో స్పష్టత వచ్చే చాన్స్..
అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయిస్తే, సుజీత్ ముందుగా నాని హీరోగా తెరకెక్కనున్న బ్లడీ రోమియో చిత్రాన్ని పూర్తి చేసే అవకాశముంది. ఈ అంశంపై రానున్న కొన్ని వారాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తొలి భాగం ఓజీని నిర్మించిన డీవీవీ దానయ్య సీక్వెల్‌ను కూడా నిర్మిస్తారా? లేక మరో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తుందా? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. సంగీత దర్శకుడు ఎస్.థమన్ ను ఈ ఫ్రాంచైజీకి కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి భాగంలోని పలువురు కీలక నటీనటులు కూడా తిరిగి కనిపించే అవకాశం ఉంది. అదే సమయంలో ఓజీ 2లో కొత్త పాత్రలు, కొత్త నటీనటులు, భిన్నమైన నేపథ్యం ఉండబోతున్నాయని, తద్వారా ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.
లాస్ట్ సినిమా ఫ్లాప్..
కాగా పవన్ కల్యాణ్ లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే డిప్యూటీ సీఎం కాకముందే ఆయా సినిమాలను అంగీకరించారు కనుక వాటిని పదవి వచ్చాక ఎట్టకేలకు పూర్తి చేశారు. మరి ఇకపై పవన్ సినిమాల్లో అసలు నటిస్తారా, ఓజీ2 ఎప్పుడు వస్తుంది, వంటి వివరాలు తెలియాలంటే అభిమానులు మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

స్పందించండి