ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తాను యువకుడిగా ఉన్న రోజుల్లో ఓ దశలో నక్సలైట్లలో చేరాలని కూడా ఆలోచించానని వెల్లడించారు. ఇటీవల ఏఎన్‌ఐకి ఇచ్చిన పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. కొంతకాలం నక్సలైట్ భావజాలం వైపు ఆకర్షితుడినయ్యానని, వారి బహిరంగ సమావేశాలకు కూడా హాజరైనట్లు చెప్పారు. అయితే తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి తన కోపాన్ని నిర్మాణాత్మక దిశగా మళ్లించారని పేర్కొన్నారు. 1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్, 2014లో జనసేన పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి రాకముందు, తన టీనేజ్ చివరి దశ నుంచి ఇరవై ఏళ్ల ప్రారంభ కాలం వరకు తీవ్ర ఆవేశంతో గడిపినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక సమయంలో తాను నక్సలైట్లలో చేరాలనే ఆలోచన కూడా చేశానని, తన టీనేజ్ చివరి దశలో తుపాకీ పట్టాలనిపించిందని, అప్పుడు తన అన్న తనను మరింత సృజనాత్మకమైన, సమాజానికి ఉపయోగపడే మార్గం వైపు మళ్లించారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తీవ్ర అంతర్మథనం కొనసాగింది..
ఆ రోజులను గుర్తు చేసుకుంటూ, తనలో ఉన్న తీవ్రమైన ఆవేశం ఎక్కడి నుంచి వస్తోందని చిరంజీవి ప్రశ్నించారని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి తాను మాట్లాడేవాడినని, వాటిపై చర్య తీసుకోవాలనే కోరిక తనలో ఉండేదని వెల్లడించారు. ఈ ఆలోచనలు తన అన్నను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఆ ఆలోచనలు బలంగా ఉండేవని, ఆ వయసులో ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందని పవన్ అన్నారు. అదే సమయంలో తన జీవితంలో తీవ్ర అంతర్మథనం కొనసాగిందని ఆయన వివరించారు. ఎవరికీ తన గురించి తెలియకుండా విద్యార్థి సమావేశాలకు వెళ్లేవాడినని, ముంబైలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొని డాక్యుమెంటరీలు రూపొందించే ప్రయత్నాలు కూడా చేశానని చెప్పారు. ఎన్నో విషయాల్లో ప్రయోగాలు చేసినప్పటికీ సంతృప్తి దొరకలేదని, నిరాశ, కోపం, అసహనం తనను వెంటాడేవని వెల్లడించారు.
ఎన్నో ఆలోచనలు వచ్చాయి..
తన మనసులో ఎన్నో ఆలోచనలు పేలిపోయాయని, తాను పిచ్చివాడిలా మారుతున్నాననే భావన కలిగేదని, అప్పుడు తన అన్న జోక్యం చేసుకున్నారని చెప్పారు. తర్వాత చిరంజీవి తనకు బాధ్యతల గురించి కొన్ని కీలక ప్రశ్నలు అడిగారని పవన్ తెలిపారు. నా అన్న చిరంజీవి కాకపోతే? ఆ కుటుంబ బాధ్యతలు నా భుజాలపై ఉంటే? నా సంపాదనపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటే? అప్పుడు కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకుంటావా? అని ప్రశ్నించారని చెప్పారు. ఆ ప్రశ్నలకు తన వద్ద సమాధానం లేకపోయిందని పవన్ వెల్లడించారు. తాను సమాధానం చెప్పలేకపోయానని, నిశ్శబ్దంగా ఉండిపోయానని తెలిపారు. అదే ప్రశ్న తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అన్యాయంపై ఉన్న కోపాన్ని సానుకూల దిశగా మలుచుకునేలా చేసిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అనంతరం సినీ రంగంలో విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించిన ఆయన, 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
సినిమాల విషయానికి వస్తే, ఇటీవల పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఓజీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలైంది. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఓ కొత్త చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.

స్పందించండి