అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమా మరోసారి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. జూన్ 26న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, తాజాగా రీషూట్‌ల కారణంగా మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని నిర్మాణ సంస్థలు ముందుగానే రిలీజ్ డేట్లను ప్రకటించడం, ప్రమోషన్స్ ప్రారంభించడం, చివరి నిమిషంలో సినిమాలను వాయిదా వేయడం తరచూ కనిపించే అంశంగా మారింది. ఇప్పుడు లెనిన్ కూడా అదే జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీల మార్పులకు గురైంది. జూన్ 26 విడుదల తేదీ ఖరారైందని చిత్రబృందం పలుమార్లు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంకో 2 వారాలు ఉందనగా..
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా రీషూట్‌ల అవసరం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 26 విడుదల దాదాపు అసాధ్యంగా మారగా, సినిమా ఇప్పుడు జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తుండగా, కథానాయికగా భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు.

స్పందించండి