అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నలెనిన్ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. దాదాపు రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలు మారగా, ఈ ఏడాదిలోనే రెండుసార్లు పోస్ట్‌పోన్ చేసిన మేకర్స్ ఇప్పుడు మూడోసారి కూడా రిలీజ్‌ను వెనక్కి జరిపారు. తాజాగా నిర్మాత నాగార్జున అక్కినేని వెల్లడించిన వివరాల ప్రకారం, దర్శకుడు, అతని బృందం ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి అందించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది. దీంతో సినిమాను జూలై 10న విడుదల చేయాలని నిర్ణయించారు. గత కొన్ని నెలలుగా పూర్తిచేయలేని పనిని కేవలం మరో రెండు వారాల్లో ఎలా సాధిస్తారన్న ప్రశ్న మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సమాధానం చెప్పాల్సింది చిత్రబృందమే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దర్శకులు కోరినందుకే..
కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ నాగార్జున సోషల్ మీడియాలో స్పందించారు. తాము 100 శాతం కృషిని అందించి, ఎంతో ప్రత్యేకమైన సినిమా ఇవ్వాలంటే ఇంకొంత సమయం కావాలని దర్శకులు కోరారని, వారి ప్యాషన్, అంకితభావం చూసి తాను అంగీకరించానని పేర్కొన్నారు. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదల తేదీల వాయిదాలు సాధారణంగా మారిపోయాయి. కొన్ని నిర్మాణ సంస్థలు ముందుగానే రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి ప్రణాళికలు లేకపోవడంతో తర్వాత వాటిని పలుమార్లు మార్చాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. లెనిన్ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున అక్కినేని, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

స్పందించండి