శనివారం, జూన్ 13, 2026
ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఏపీ డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై జగన్ తీవ్ర ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్!

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ (DSC) నియామక ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఏపీ డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌పై జగన్ తీవ్ర ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్!
కూటమి ప్రభుత్వంపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శలు గుప్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్. Photo Credit: YS Jagan Mohan Reddy/X.

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ (DSC) నియామక ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర థర్డ్‌పార్టీ ఏజెన్సీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించిన జగన్, 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత విధానాలను ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందని ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా అధికార కేంద్రీకరణ జరిగిందని పేర్కొన్నారు.

ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వ‌డం లోపం..

అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్ ప్రక్రియలను ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ విమర్శించారు. ఈ ప్రక్రియలో భాగమైన ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం పేపర్ లీకేజీ అనుమానాలకు బలం చేకూరుస్తోందని అన్నారు. అనంతరం అతనికి ఉద్యోగం ఇవ్వకపోవడం, మెరిట్ జాబితా నుంచి వివరాలు తొలగించడం వంటి పరిణామాలు మరిన్ని సందేహాలకు కారణమయ్యాయని అన్నారు. ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లోపించిందని జగన్ ఆరోపించారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ జాబితాలు ప్రదర్శించకుండా, కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ప‌రీక్ష లేకుండానే నియామ‌కాలు..

క్రీడా కోటా నియామకాల విషయంలోనూ ప్రభుత్వం విధానాలను మార్చి, పరీక్ష లేకుండానే నియామకాలకు అవకాశం కల్పించిందని జగన్ ఆరోపించారు. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా బ్యాక్‌డోర్ ఎంట్రీలకు మార్గం సుగమం చేసినట్లయిందని విమర్శించారు. టీచర్ పోస్టు కోసం బేరసారాలు జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియోను కూడా జగన్ ప్రస్తావించారు. ఆ ఘటనపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపలేదని ఆరోపించారు. డీఎస్సీ ప్రక్రియ మొత్తం దశలవారీగా జరిగిన భారీ స్కామ్‌గా కనిపిస్తోందని పేర్కొన్న జగన్, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ ప్రభావంలో ఉన్నందున నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని డిమాండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన తన మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి