భారత జట్టు జనవరి 2026లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత తొలిసారిగా మళ్లీ వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెడుతోంది. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న టీమిండియా, తొలి వన్డేను శనివారం ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో యువ పేసర్ హర్షిత్ రానా తిరిగి చేరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, హర్షిత్ రాణా సిరీస్‌లోని మూడో, చివరి వన్డేకు ముందు భారత జట్టుతో కలవనున్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న చివరి వన్డేకు ముందు అతడు జట్టులో చేరనున్నట్లు సమాచారం. 2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన హర్షిత్ గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఆ గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా, 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు టాటా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తాన్ని కోల్పోయాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు ప్రకటించిన రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల జట్టులో అతనికి చోటు కల్పించారు.
క్లియరెన్స్ పొందిన వెంటనే..
జట్టు వర్గాల సమాచారం ప్రకారం, సిరీస్ ప్రారంభంలోనే జట్టుతో చేరే అవకాశం హర్షిత్‌కు ఇచ్చినా, అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మరింత ప్రాక్టీస్ చేయడం అవసరమని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతిరోజూ తొమ్మిది నుంచి పది ఓవర్లు బౌలింగ్ చేస్తూ తన తీవ్రతను నిలబెట్టుకుంటున్నాడు. బ్యాటింగ్‌పై కూడా కష్టపడుతున్నాడు. జూన్ 17న అధికారికంగా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన వెంటనే చెన్నైకి ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2025లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, అనంతరం భారత జట్టు తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడాడు. ఆ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచి తన తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ, స్వదేశంలో న్యూజిలాండ్‌పై జరిగిన సిరీస్‌లోనూ ఆకట్టుకున్న ప్రదర్శనలు చేశాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్ తర్వాత వన్డే జట్టులో అతడికి అవకాశం రాలేదు.
హర్షిత్ బలం అదే..
బౌలింగ్‌తోపాటు దిగువ వరుసలో విలువైన పరుగులు చేయగల సామర్థ్యం హర్షిత్ రాణాకు అదనపు బలంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక అర్ధశతకం నమోదు చేసిన అతడు, విరాట్ కోహ్లితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. హర్షిత్ రాణా తిరిగి జట్టులో చేరడం ద్వారా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కు ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు మరిన్ని ఎంపికలు లభించనున్నాయి. ఇప్పటివరకు 14 వన్డేల్లో 26 వికెట్లు పడగొట్టిన హర్షిత్, 27.38 సగటు, 6.22 ఎకానమీతో మంచి రికార్డును నమోదు చేశాడు. హార్దిక్ పాండ్యా గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా అందుబాటులో లేని సందర్భాల్లో హర్షిత్ కీలక పాత్ర పోషించాడు. భవిష్యత్తులో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా ఎదగగల ఆటగాళ్లలో హర్షిత్ రాణాతోపాటు నితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

స్పందించండి