శనివారం, జూన్ 13, 2026
టెక్నాల‌జీ

మెటా యాప్స్‌లో సరికొత్త ఫుట్‌బాల్ ఫీచర్లు.. ప్రపంచ టోర్నీ వేళ ఫ్యాన్స్‌కు పండగే!

ఈ వేసవిలో ఉత్తర అమెరికాలో జరుగుతున్న ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను పురస్కరించుకుని మెటా తన అన్ని ప్రముఖ యాప్‌లలో ఫుట్‌బాల్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. రియల్‌టైమ్ చర్చలు, క్రియేటర్ కంటెంట్, అభిమానుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ అప్‌డేట్లను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

మెటా యాప్స్‌లో సరికొత్త ఫుట్‌బాల్ ఫీచర్లు.. ప్రపంచ టోర్నీ వేళ ఫ్యాన్స్‌కు పండగే!
ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నీ కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకొచ్చిన మెటా. Photo Credit: Meta/Facebook.

ఈ వేసవిలో ఉత్తర అమెరికాలో జరుగుతున్న ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను పురస్కరించుకుని మెటా తన అన్ని ప్రముఖ యాప్‌లలో ఫుట్‌బాల్‌కు సంబంధించిన పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. రియల్‌టైమ్ చర్చలు, క్రియేటర్ కంటెంట్, అభిమానుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ అప్‌డేట్లను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. టోర్నమెంట్‌కు ముందు నుంచి మ్యాచ్‌ల అనంతర చర్చల వరకు అభిమానులను మరింత దగ్గర చేయడానికి మెటా క్రియేటర్లు, అథ్లెట్లు, జాతీయ జట్లు, కామెంటేటర్లు, బ్రాడ్‌కాస్టర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మ్యాచ్‌లలోని కీలక క్షణాలు, తెరవెనుక విశేషాలు, ప్రీ-గేమ్ సన్నాహాలు, పోస్ట్-గేమ్ విశ్లేషణలు, విజయ సంబరాలు, నిరాశ క్షణాలు అన్నీ మెటా యాప్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

థ్రెడ్స్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్లు..

రియల్‌టైమ్ చర్చలకు ప్రసిద్ధి చెందిన థ్రెడ్స్‌లో టోర్నమెంట్ కోసం ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మైదానంలో ఏదైనా కీలక సంఘటన జరిగిన వెంటనే అభిమానులు తమ అభిప్రాయాలు, సరదా వ్యాఖ్యలు, స్పందనలను థ్రెడ్స్‌లో పంచుకోవచ్చు. లైవ్ చాట్స్ ఫీచర్ ద్వారా ప్రముఖ ఫుట్‌బాల్ వ్యాఖ్యాతలు, ఆటగాళ్లు, క్రియేటర్లు మ్యాచ్‌లకు ముందు, మ్యాచ్ సమయంలో, అనంతరం ప్రత్యక్ష చర్చలు నిర్వహించనున్నారు. అభిమానులు నేరుగా స్పందించడంతోపాటు ప్రశ్నలు అడగవచ్చు. అర్జెంటీనా దిగ్గజం సెర్జియో అగెరో, మాజీ ఇంగ్లాండ్ స్ట్రైకర్ ఇయాన్ రైట్‌లు టోర్నమెంట్‌లో తలో మూడు లైవ్ చాట్స్ నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్ కమ్యూనిటీ పేరుతో ప్రత్యేక టోర్నమెంట్ కమ్యూనిటీని కూడా ప్రారంభించింది. ఇందులో మ్యాచ్ డే చర్చలు, ఆటగాళ్ల కంటెంట్, పోస్ట్ మ్యాచ్ విశ్లేషణలు అందుబాటులో ఉంటాయి. అలాగే లైవ్ స్కోర్లు, టీమ్ ఫ్లేర్, స్టికర్ ప్యాక్స్, కస్టమ్ ఎమోజీలు, మీడియా హైలైట్స్, గేమ్ రిమైండర్లు వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ను ప్ర‌ధాన వేదిక‌గా..

టోర్నమెంట్‌కు సంబంధించిన కంటెంట్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రధాన వేదికగా మార్చేందుకు మెటా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొత్త ఎన్హాన్స్‌డ్ సెర్చ్ ద్వారా టోర్నమెంట్‌కు సంబంధించిన రీల్స్, స్టోరీలు, అధికారిక బ్రాడ్‌కాస్టర్లు, జాతీయ జట్ల కంటెంట్, అభిమానుల పోస్టులను ఒకే చోట చూడవచ్చు. ఇక డీఎంలలో గోల్ ఏఐ వాయిస్ ఎఫెక్ట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఎఫెక్ట్‌ను పంపినప్పుడు ప్రత్యేక యానిమేషన్ కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో ఫుట్‌బాల్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఫీడ్ పైభాగంలోని ఫేస్‌బుక్ లోగోను డబుల్ ట్యాప్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇందులో ప్రత్యేక రియాక్షన్లు, ఫుట్‌బాల్ గేమ్, కస్టమ్ యాప్ ఐకాన్ వంటి సదుపాయాలు ఉంటాయి. వేర్ ఇట్ అనే ఏఐ ఫీచర్ ద్వారా అభిమానులు తమకు నచ్చిన జాతీయ జట్టు జెర్సీని వర్చువల్‌గా ధరించినట్లు ఫోటోలను రూపొందించుకోవచ్చు. వీటిని ప్రొఫైల్ ఫోటోగా, స్టోరీగా లేదా పోస్టుగా షేర్ చేయవచ్చు.

ప్ర‌త్యేక థీమ్ స్టిక్కర్లు, డిజైన్ ఎడిట్స్‌..

ఫుట్‌బాల్ థీమ్ స్టికర్లు, ప్రత్యేక డిజైన్ ఎడిట్స్, మ్యాచ్ విజయాలు లేదా పరాజయాలపై భావోద్వేగాలను వ్యక్తపరచడానికి కొత్త టూల్స్ కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. మెసెంజర్ గ్రూప్ చాట్స్‌లో లైవ్ అప్‌డేట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గోల్స్, రెడ్ కార్డ్స్, ఇతర కీలక క్షణాల సమాచారం రియల్‌టైమ్‌లో గ్రూప్ చాట్‌లో కనిపిస్తుంది. అలాగే పరిమిత కాలం పాటు ఫుట్‌బాల్ థీమ్ చాట్ బ్యాక్‌గ్రౌండ్, ప్రత్యేక యానిమేటెడ్ స్టికర్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ కూడా టోర్నమెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. అడిడాస్‌తో భాగస్వామ్యంగా ట్రియొండా మ్యాచ్ బాల్ ఎమోజీని అందుబాటులోకి తెచ్చింది. ఫైనల్ మ్యాచ్ వరకు ఈ ప్రత్యేక ఎమోజీని సందేశాల్లో లేదా రియాక్షన్‌గా ఉపయోగించవచ్చు. వీడియో కాల్స్ కోసం ఫుట్‌బాల్ థీమ్ ఫిల్టర్లు, మ్యాచ్‌లపై స్పందించేందుకు ప్రత్యేక ఫుట్‌బాల్ స్టికర్ ప్యాక్స్, జట్లు, స్కోర్లు, కౌంట్‌డౌన్లు, హైలైట్స్, అప్డేట్లను ఒకేచోట చూపించే ఫుట్‌బాల్ డైరెక్టరీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇక ఛానల్స్ తమ అప్డేట్లను స్టేటస్ రూపంలో పంచుకునే అవకాశం కూడా కల్పించింది.

మోసాలు, వేధింపుల‌కు చెక్ పెట్టేలా..

టోర్నమెంట్ సమయంలో మోసాలు, వేధింపులు పెరిగే అవకాశం ఉండటంతో మెటా పలు భద్రతా చర్యలను అమలు చేస్తోంది. టికెట్‌లకు సంబంధించిన సెర్చ్‌లలో హెచ్చరికలు, మెరుగైన యాంటీ-స్కామ్ వ్యవస్థలు, దుర్వినియోగాన్ని అడ్డుకునే కొత్త భద్రతా టూల్స్‌ను ప్రవేశపెట్టింది. మెటా గ్లోబల్ ఫుట్‌బాల్ లీడ్ రాబ్ పిల్‌గ్రిమ్ మాట్లాడుతూ, ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా మారబోతోందని, మ్యాచ్‌లకు మించి అభిమానులను ఒకే వేదికపై కలిపే కేంద్రంగా మెటా యాప్‌లు నిలుస్తాయని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి