శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తాజాగా ప్రారంభమైంది. ఈ సినిమా పూజ కార్యక్రమానికి దర్శకుడు శ్రీను వైట్ల హాజరై చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతికి విడుదలై విజయాన్ని అందుకున్న నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టిన ఛార్మింగ్ స్టార్ శర్వా, స్పోర్ట్స్ డ్రామా ది బైకర్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన భోగి సినిమాలో నటిస్తున్నారు. తరువాత శర్వా తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు శ్రీను వైట్లతో చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. శ్రీను వైట్ల శైలిలో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
2027 సంక్రాంతికి విడుదల..
నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారు. సంక్రాంతి సీజన్ శర్వాకు అత్యంత విజయవంతమైన సమయంగా భావిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో శర్వా విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఆయన గత రెండు సినిమాల విజయాలు ప్రస్తుతం మంచి జోష్‌ను అందించాయి. దర్శకుడు శ్రీను వైట్ల శర్వాను కొత్త కోణంలో చూపించేలా సరికొత్త, విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శర్వా గతంలో కనిపించని పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా కార్యాలయాన్ని ప్రారంభించింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
వరుస ఫ్లాపులతో సతమతం..
కాగా దర్శకుడు శ్రీను వైట్ల ఈమధ్య కాలంలో వరుస ఫ్లాపులను చవిచూశారు. ఆయన చివరి సారిగా తెరకెక్కించిన విశ్వం సినిమా 2024లో విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు 2 ఏళ్ల విరామం అనంతరం ఆయన శర్వాతో సినిమా చేస్తున్నారు. అంతకు ముందు ఆయన రవితేజతో చేఇన అమర్ అక్బర్ ఆంథోని, వరుణ్ తేజ్‌తో చేసిన మిస్టర్, రామ్ చరణ్‌తో తెరకెక్కించిన బ్రూస్‌లీ ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ సినిమాలకు ముందు ఆయన మహేష్ బాబుతో చేసిన దూకుడు సినిమా సూపర్ హిట్ అవగా, ఆ తరువాత వచ్చిన జూనియర్ ఎన్‌టీఆర్ మూవీ బాద్‌షా, మహేష్ బాబు మూవీ ఆగడు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అనంతరం అసలు శ్రీను వైట్లకు విజయాలు లేకుండా పోయాయి. అయితే శర్వానంద్ సినిమాతో అయినా ఆయన హిట్ కొట్టి మళ్లీ ట్రాక్‌లో పడతారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

స్పందించండి