
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్వహించిన భారీ రోడ్‌షోలలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌లో దాగి ఉన్న బీజేపీ ట్రోజన్ హార్స్ గా అభివర్ణించారు. ప్రజలు కాంగ్రెస్ ముఖాన్ని తొలగించి చూస్తే లోపల దాగి ఉన్న కాషాయ స్వరూపం బయటపడుతుందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ హృదయపూర్వక కాంగ్రెస్‌వాది కాదు. ఆయన అసలు బీజేపీ మనిషే. ఢిల్లీలో ఉన్న బడే భాయ్ కి తమ్ముడిలాంటి వాడు.. అంటూ తెలంగాణ సీఎం, ఢిల్లీ బీజేపీ పెద్దల మధ్య రహస్య అవగాహన ఉందని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై విమర్శలే రేవంత్ అజెండా..
పరిపాలన స్థానంలో దూషణలు, బెదిరింపులే ఆయుధంగా మార్చుకున్నారని రేవంత్ రెడ్డిపై ఆరోపించారు. 420 హామీల అమలుపై ప్రశ్నిస్తే, ప్రజల పేగులు తీస్తా, కళ్లతో గోళీలు ఆడతానంటూ వీధి భాషలో మాట్లాడతాడు.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం మొత్తం ఒకే అజెండాతో నడుస్తోందని, అది కేసీఆర్ పై విమర్శలేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. భక్తుడు రామ కోటి రాసినంతగా రేవంత్ కేసీఆర్ పేరు జపిస్తున్నాడు. అసలు కేసీఆర్ ఆయన ఉనికినే పట్టించుకోడు. ఆ నిర్లక్ష్యమే రేవంత్‌ను ఎప్పటికీ చిరాకు స్థితిలో ఉంచుతోంది.. అని అన్నారు.
పోచారం రాజీనామా చేయాలి..
ఇంతకుముందు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డి పోచారంను ఎద్దు, ఆయన కుమారులను ఇసుక స్మగ్లింగ్‌లో ఉన్న గేదెలుగా దూషించిన వీడియోలను ప్రదర్శిస్తూ, ఇప్పుడు అదే రేవంత్ కోసం కాంగ్రెస్‌లో చేరారని విమర్శించారు. కేసీఆర్‌కు జీవితాంతం విధేయుడిగా ఉంటానని వెంకటేశ్వర స్వామిని సాక్షిగా ప్రమాణం చేసిన పోచారం, ఇప్పుడు రేవంత్ టేబుల్‌పై పడిన కొద్దిపాటి మిగులు కోసం ఆత్మను అమ్ముకున్నారు. కాస్తైనా ఆత్మగౌరవం ఉంటే రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలి. లేదంటే రేవంత్ గతంలో చెప్పిన సలహానే పాటించాలి.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలి..
కాంగ్రెస్ లూట్ అండ్ స్కూట్ మోడల్ ఇప్పుడు మున్సిపల్ స్థాయికి దిగివచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. జుక్కల్ ఎమ్మెల్యే వ్యాపారుల నుంచి కమిషన్లు వసూలు చేసే కలెక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ క్యాష్ ఫర్ ఓట్స్ వ్యూహానికి నిధులు సమకూరుస్తున్నారని విమర్శించారు. దండుపాళ్యం, స్టువర్ట్‌పురం గ్యాంగ్‌లతో కాంగ్రెస్ పనితీరును పోల్చారు. రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500, ఒక తులం బంగారం అన్నారు.. ఇవన్నీ ఎక్కడ? ఇది మోసాల ప్రభుత్వం.. అంటూ మండిపడ్డారు. మున్సిపల్ బ్యాలెట్‌ను కాంగ్రెస్ ద్రోహాలకు గిలోటిన్ గా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. హామీల ప్రయోజనాలు నిజంగా అందుకున్నవారే చేతి గుర్తుకు ఓటు వేయాలన్న ఆయన, మిగతావారంతా రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.













