
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలను అసలు అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా సరే ఆ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు వారు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 6 గ్యారంటీలు అమలు కాలేదని తాను నిరూపిస్తే రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారా..? అని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డు స్థలాన్ని ఆయన స్థానిక బీజేపీ నాయకులు, గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
డబ్బు మూటలు పంచేందుకే రేవంత్ కేరళకు..
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గతంలో బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా వెళ్లారని, తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పడంతో అక్కడి ప్రజలు వాస్తవాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ఇప్పుడు కేరళలోనూ అలాగే ప్రచారం చేస్తున్నారని, డబ్బు మూటలు పంచడానికే సీఎం రేవంత్ రెడ్డి కేరళ వెళ్లారని ఆరోపించారు.
కేరళ ప్రజలు, మీడియా తెలంగాణలో పర్యటిస్తే 6 గ్యారంటీల అమలుపై వాస్తవాలు తెలుస్తాయన్నారు. అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ కంటే పెద్ద అవార్డు ఇవ్వాలని విమర్శించారు. డంపింగ్ యార్డు ఏర్పాటును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తుందని తెలిపారు.













