ఆదివారం, జూన్ 14, 2026
టెక్నాల‌జీ

ఆసుస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌లు విడుదల.. రూ.999 కే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం!

ఆసుస్ భారత మార్కెట్లో తన ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. గేమింగ్, క్రియేటర్‌లను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ఆర్‌ఓజీ జెఫైరస్ డ్యుయో, జెఫైరస్ జీ14, జెఫైరస్ జీ16, ప్రోఆర్ట్ పీజెడ్14, టఫ్ గేమింగ్ ఏ14 మోడళ్లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లకు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి.

ఆసుస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌లు విడుదల.. రూ.999 కే ప్రీ-బుకింగ్స్ ప్రారంభం!
భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్. Photo Credit: Asus India/X.

ఆసుస్ భారత మార్కెట్లో తన ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. గేమింగ్, క్రియేటర్‌లను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ఆర్‌ఓజీ జెఫైరస్ డ్యుయో, జెఫైరస్ జీ14, జెఫైరస్ జీ16, ప్రోఆర్ట్ పీజెడ్14, టఫ్ గేమింగ్ ఏ14 మోడళ్లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లకు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. కేవలం రూ.999 బుకింగ్ మొత్తంతో దేశవ్యాప్తంగా ఆర్‌ఓజీ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ భాగస్వాముల ద్వారా వినియోగదారులు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్లకు ఆసుస్ రూ.27,299 విలువైన ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రెండేళ్ల అదనపు వారంటీ, మూడేళ్ల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. అదనంగా 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కంపెనీ ప్రకటించింది.

గేమ‌ర్లు, కంటెంట్ క్రియేట‌ర్ల కోసం..

గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, అలాగే అధిక పనితీరు కోరుకునే సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త లైనప్‌ను రూపొందించినట్లు ఆసుస్ తెలిపింది. అన్ని కొత్త మోడళ్లలో ఎన్‌విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 50 సిరీస్ గ్రాఫిక్స్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆర్‌ఓజీ జెఫైరస్ డ్యుయో. ఇందులో రెండు 16 ఇంచుల 3కే ఓఎల్‌ఈడీ టచ్ డిస్‌ప్లేలు కలిగిన డ్యూయల్-స్క్రీన్ డిజైన్‌ను అందించారు. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 సిరీస్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 వరకు గ్రాఫిక్స్ ఎంపికలు లభిస్తాయి. ఈ డివైస్ గరిష్టంగా 1,824 టాప్స్ ఏఐ కంప్యూటింగ్ పనితీరును అందిస్తుంద‌ని ఆసుస్ పేర్కొంది. 320 డిగ్రీల హింజ్ మెకానిజం ద్వారా వివిధ వినియోగ విధానాలకు మద్దతు లభిస్తుంది. లిక్విడ్ మెటల్, ట్రై-ఫ్యాన్ ఆధారిత కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. ఈ మోడల్ ధర రూ.5,49,990 నుంచి ప్రారంభమై రూ.6,99,990 వరకు ఉంటుంది.

జెఫైర‌స్ జీ-సిరీస్ లైన‌ప్‌లో..

జెఫైరస్ జీ-సిరీస్ లైనప్‌ను కూడా ఆసుస్ అప్‌డేట్ చేసింది. జెఫైరస్ జీ14 కేవలం 1.5 కిలోల బరువుతో వస్తోంది. ఇందులో 3కే నెబ్యులా హెచ్‌డీఆర్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 73 వాట్-ఆవర్ బ్యాటరీ, ఆర్‌టీఎక్స్ 5070 జీపీయూ ఉన్నాయి. దీని ధరను రూ.3,69,990గా నిర్ణయించారు. ఇక పెద్ద స్క్రీన్‌తో వచ్చే జెఫైరస్ జీ16లో 2.5కే హెచ్‌డీఆర్ డిస్‌ప్లే, 1,100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 90 వాట్-ఆవర్ బ్యాటరీ ఉన్నాయి. ఆర్‌టీఎక్స్ 5080 జీపీయూ వరకు కాన్ఫిగరేషన్లు లభిస్తాయి. దీని ధరలు రూ.4,19,990 నుంచి రూ.5,09,990 వరకు ఉన్నాయి. ఈ రెండు మోడళ్లూ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్‌లతో పనిచేస్తాయి. కంటెంట్ క్రియేటర్ల కోసం ఆసుస్ ప్రోఆర్ట్ పీజెడ్14ను పరిచయం చేసింది. 14 ఇంచుల 2-ఇన్-1 డివైస్‌గా రూపొందించిన ఈ మోడల్ క్వాల్ క‌మ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్2 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డిటాచబుల్ కీబోర్డ్, 3కే లూమినా ప్రో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఆసుస్ పెన్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ డివైస్ 80 టాప్స్ వరకు ఏఐ పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 22 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ప్రోఆర్ట్ పీజెడ్14 ధరను రూ.2,69,990గా నిర్ణయించారు.

ట‌ఫ్ గేమింగ్ ఎ14 అయితే..

ఈ లైనప్‌లో అత్యంత అందుబాటు ధరలో వచ్చిన మోడల్ టఫ్ గేమింగ్ ఏ14. ఏఎండీ రైజెన్ ఏఐ 9 465 ప్రాసెసర్‌తోపాటు ఎన్‌విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5060 జీపీయూను ఇందులో అందించారు. కేవలం 1.46 కిలోల బరువుతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ.1,99,990గా ఉంది. ఆసుస్ ఇండియా కన్స్యూమర్, గేమింగ్ పీసీ విభాగ వైస్ ప్రెసిడెంట్ అర్నాల్డ్ సు మాట్లాడుతూ గేమింగ్, కంటెంట్ క్రియేషన్, రోజువారీ ఉత్పాదకత అవసరాలన్నింటినీ ఒకే డివైస్ ఎకోసిస్టమ్ ద్వారా తీర్చేలా ఈ కొత్త పోర్ట్‌ఫోలియోను రూపొందించామని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి