ధనుష్ నటిస్తున్న 55వ చిత్రానికి మేకర్స్ అధికారికంగా ఓం అనే టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్‌తోపాటు విడుదల చేసిన ఓం ఫస్ట్ స్ట్రైక్ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దట్టమైన అడవులు, సాయుధ ఘర్షణలు, తిరుగుబాటు నేపథ్యంలో సాగే తీవ్రమైన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా కనిపిస్తోంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో తెరకెక్కించిన అమరన్ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుత సినిమాలో ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
పుష్ప సినిమాతో పోలిక..
టీజర్ ఆరంభంలో పర్వతాలు, అడవులు, ఆలయ పట్టణం వంటి అద్భుత దృశ్యాలను చూపించిన మేకర్స్, ఆ తర్వాత వర్షంలో తడిసిన అడవిలో జరిగే ఉత్కంఠభరిత ఘర్షణను ప్రదర్శించారు. విజువల్స్‌ను బట్టి చూస్తే, కథ ఎర్రచందనం స్మగ్లింగ్, దాని చుట్టూ జరిగే సంఘర్షణల నేపథ్యంలో సాగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం కారణంగా ఈ చిత్రాన్ని పుష్ప సినిమాతో పోలుస్తూ చర్చలు జరుగుతున్నాయి.
విడుదల అప్పుడే..
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఓం చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ధనుష్ చివరిసారిగా నటించిన కర చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోగా, అంతకు ముందు ఆయన తేరి ఇష్క్ మే, కుబేరా, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో నటించి అలరించారు.

స్పందించండి