రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విడుదలైన తర్వాత నటి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పూర్తిగా మౌనంగా మారిన విషయం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో తన పాత్రను చూపించిన విధానంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారని పలు కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానాపై వచ్చిన విమర్శలు కూడా ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు, సినీ విశ్లేషకులు జాన్వీ పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని, ఆమెను ప్రధానంగా గ్లామర్ కోణంలోనే చూపించారని అభిప్రాయపడ్డారు. సినిమా విడుదలైన తర్వాత కొన్ని రోజుల పాటు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెద్దికి సంబంధించిన ఎలాంటి పోస్టులు చేయలేదు. దీంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంటోందా అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే దాదాపు రెండు వారాల తర్వాత జాన్వీ మళ్లీ సోషల్ మీడియాలో చురుకుగా కనిపించింది.
వ్యక్తిగత వీడియో షేర్..
తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వీడియోను పంచుకుంది. అందులో తన సోదరితో గడిపిన క్షణాలు, పెంపుడు కుక్కతో సరదా సమయం, స్నేహితులతో గడిపిన సందర్భాలు, అలాగే వర్కౌట్ సెషన్ల దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా గాయని జస్లీన్ రాయల్ ను ట్యాగ్ చేస్తూ ఆమె కొత్త పాటను ప్రశంసించింది. ఈ పోస్ట్ ద్వారా జాన్వీ కపూర్ పెద్ది వివాదాన్ని వెనక్కి నెట్టి, మళ్లీ తన సాధారణ జీవనశైలికి తిరిగి వచ్చినట్లు సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది.

స్పందించండి