
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసుతోపాటు పలు ఇతర కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. అంబటి రాంబాబుకు అన్ని కేసుల్లోనూ గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 18, 2026) జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులు 36 కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై మరో 16 కేసులు నమోదయ్యాయి. అలాగే సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రాలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కూడా అంబటిపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులన్నింటిలోనూ ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
దేవుడు ఉన్నాడు, ధర్మమే గెలుస్తుంది: అంబటి
జైలు నుంచి విడుదల అయిన అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తనపై దాడులకు పాల్పడ్డారని, తనను హింసించారని ఆరోపించారు. తన భార్య, పిల్లల్ని తరిమారని, తన కార్లను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. తన ఇల్లు తగలబెట్టేందుకు యత్నించారని, అయినప్పటికీ తాను పట్టించుకోనని అన్నారు. తాను ఒక బాధితుడిని అయితే బాధితుడిని జైలులో పెట్టి నిందితులను వదిలేశారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా తనకు మద్దతు ఇచ్చిన వారికి అంబటి కృజ్ఞతలు తెలిపారు. తనపై జరిగిన దాడిని ఖండించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేవుడు ఉన్నాడని, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా అంబటి తన ఎక్స్ ఖాతాలోనూ పోస్టు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా అడుగు వెనక్కి వేసేది లేదు, వైఎస్ జగన్ నాయకత్వంలో కూటమిని కూల్చేవరకు తన పోరాటం ఆగదని తెలిపారు.













