గురువారం, జూన్ 11, 2026
వినోదం

బాలీవుడ్‌లో వివక్ష.. రెజీనా క‌సాండ్రా ఆవేదన..

దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా క‌సాండ్రా తాజాగా బాలీవుడ్‌లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు.

బాలీవుడ్‌లో వివక్ష.. రెజీనా క‌సాండ్రా ఆవేదన..
బాలీవుడ్‌లో ఎదురైన వివక్షపై స్పందించిన రెజీనా. Photo Credit: Regina Cassandra/Instagram.
Actress Regina Cassandra talking about her experience in Hindi film industry.
బాలీవుడ్‌లో ఎదురైన వివక్షపై స్పందించిన రెజీనా. Photo Credit: Regina Cassandra/Instagram.

దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా క‌సాండ్రా తాజాగా బాలీవుడ్‌లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు. ఇందుకు ప్రధాన కారణం తన దక్షిణాది నేపథ్యమేనని చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమయంలో ఎదురైన పాక్షికతను వివరించారు. తాను హిందీ భాషలో ప్రవీణురాలినని, తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ, అక్కడ తనను ఔట్‌సైడర్ గానే చూశారని పేర్కొన్నారు. త‌న‌ను తక్కువగా చూసే విధానం త‌న‌కు స్పష్టంగా తెలిసింద‌ని, ఆ కారణంగా ఉత్తర భారత చిత్ర పరిశ్రమలో పనిచేయడంపై కొంత భయం, సంకోచం కలిగింద‌ని ఆమె అన్నారు.

మాట‌ల‌తోనే కాదు, చ‌ర్య‌ల‌తో కూడా: రెజీనా..

ఈ పాక్షికత మాటలకే పరిమితం కాలేదని, కొందరి ప్రవర్తనలో కూడా కనిపించిందని రెజీనా తెలిపారు. చాలా మంది త‌న‌ను అవమానకరంగా ట్రీట్ చేశార‌ని, మాటలతోనే కాదు, వారి చర్యలతో కూడా త‌న‌కు అలా అనిపించింద‌ని ఆమె చెప్పారు. అయితే అందరూ అలా ప్రవర్తించలేదని, కానీ ఇలాంటి అనుభవాలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని అంగీకరించారు. చిత్ర పరిశ్రమలో మహిళలు తరచూ రూపం ఆధారంగా స్టీరియోటైప్ చేయబడతారని కూడా రెజీనా అన్నారు. ఇది విజువల్ మీడియా కావడంతో, ఒకసారి ఏదైనా ఇమేజ్ ఏర్పడితే అదే ముద్రపడిపోతుంద‌ని చెప్పిన ఆమె, విభిన్నమైన పాత్రలు చేయాలనే తపన తనలో ఎప్పటినుంచో ఉందన్నారు.

వెర్స‌టైల్ గా ఉండాల‌ని కోరుకుంటా..

నేను ఎప్పుడూ ఒకే తరహా కమర్షియల్ పాత్రల్లో ఇరుక్కోవాలని అనుకోను. వెర్సటైల్‌గా ఉండాలని కోరుకుంటాను.. అని రెజీనా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో సవాళ్లు ఎదురైన‌ప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఆ అనుభవాలు తనను మరింత బలంగా తీర్చిదిద్దాయని అన్నారు. రాకెట్ బాయ్స్‌, ఫ‌ర్జి వంటి ప్రాజెక్టులతో హిందీ ప్రేక్షకుల్లోనూ గుర్తింపు సంపాదించుకున్న ఆమె, కాలక్రమేణా చాలా విషయాలు నేర్చుకున్నాను. అవసరం లేని విషయాలను మర్చిపోయాను. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితులు మెరుగుపడుతున్నాయనే నమ్మకం ఉంది.. అని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి