
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు కాగా, దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ నేతృత్వంలోని సిట్ తమ ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో నాలుగు నమూనాల పరీక్షల్లో జంతు కొవ్వు అవశేషాలు లేవని తేలినట్లు పేర్కొనడం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. ఈ సమాచారం వెలుగులోకి రాగానే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా దూకుడు పెంచాయి. గతంలో ఈ అంశంపై జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో దాడి మొదలుపెట్టాయి. సోషల్ మీడియా వేదికగా, పార్టీకి అనుబంధ గ్రూపులు ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ చంద్రబాబు, పవన్‌లను దోషులుగా చిత్రీకరిస్తున్నాయి.
ఒక కోణం మాత్రమేనా..?
అయితే వైసీపీ ప్రస్తావిస్తున్నది వివాదంలోని ఒక కోణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీబీఐ దర్యాప్తులో బయటపడిన అసలు కీలక అంశం – లడ్డూల తయారీలో వాడాల్సిన స్వచ్ఛమైన నెయ్యి (ప్యూర్ ఘీ) మొదటినుంచే అందుబాటులో లేకపోవడమేనని తెలుస్తోంది. అంతేకాకుండా లడ్డూల తయారీలో వాడిన నెయ్యిలో మొక్కజాతికి చెందిన కొవ్వులు (ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్స్) కలిసినట్టు కూడా గుర్తించినట్లు సమాచారం. టీడీపీ వర్గాలు ఉటంకిస్తున్న ఆరోపణల ప్రకారం, కలుషిత నెయ్యిలో బీటా కెరోటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్, పామ్ కర్నెల్ ఆయిల్ తదితర రసాయన పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలినట్టు చెబుతున్నారు. ఈ నెయ్యి కొనుగోలు ప్రక్రియలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విజయం సాధించిన వైసీపీ..?
అంటే లడ్డూల తయారీలో జంతు కొవ్వు లేకపోయినప్పటికీ, స్వచ్ఛమైన నెయ్యి ఉపయోగించలేదన్న అంశం ఇప్పుడు ప్రధానంగా నిలుస్తోంది. కానీ వైసీపీ మాత్రం లడ్డూలో జంతు కొవ్వు లేదు అనే ఒక్క అంశాన్నే ముందుకు తెచ్చి, అదే పూర్తి నిజమన్నట్టుగా ప్రచారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంతో సోషల్ మీడియా వేదికగా తమకు అనుకూలమైన కథనాన్ని వైసీపీ బలంగా నెట్టే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటివరకు ఆ ప్రచారంలో కొంతవరకు విజయం సాధించినట్టే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పరస్పర ఆరోపణలు..
అయితే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. లడ్డూ వివాదంలో గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేవలం జంతువుల కొవ్వు మాత్రమే కలిసిందని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అది లేదని తెలిసే సరికి అందులో వృక్ష సంబంధ కొవ్వు ఉందని కొత్త ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేకపోయినా అది ఉందని తప్పుడు ప్రచారం చేసినందుకు వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్‌లు క్షమాపణలు చెబుతారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కూడా ఆ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. ఈ విషయంలో ఇరు పక్షాలు నువ్వెంత అంటే నువ్వెంత అని పరస్పరం నిందించుకుంటూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.













