
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది. ప్రస్తుతం ఎల్పీజీ (LPG) సరఫరా విషయంలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ, దేశంలోని ఏ పంపిణీ కేంద్రం నుంచీ గ్యాస్ పూర్తిగా అయిపోయిందని ఎలాంటి నివేదికలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరిపడా నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయని కూడా హామీ ఇచ్చింది. భారత్ ప్రపంచంలో ఎల్పీజీని అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ఈ గ్యాస్ సరఫరాలో దాదాపు 90 శాతం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ కీలక రవాణా మార్గంలో నౌకా రవాణా దాదాపు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.
పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న రిఫైనరీలు..
పెట్రోలియం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) సుజాత శర్మ మాట్లాడుతూ భారత్‌కు అవసరమైన క్రూడ్ ఆయిల్ సరఫరా తగినంతగా ఉందని, దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. మాకు అవసరమైన క్రూడ్ సరఫరా తగినంతగా ఉంది. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రిటైల్ అవుట్‌లెట్లలో ఎక్కడా ఇంధనం పూర్తిగా అయిపోయిందని నివేదికలు లేవు. పెట్రోల్, డీజిల్ సరిపడా అందుబాటులో ఉన్నాయి.. అని ఆమె తెలిపారు. అదనంగా దేశ అవసరాలకు సరిపడేంత పెట్రోల్, డీజిల్‌ను భారత్ దేశీయంగా ఉత్పత్తి చేస్తుందని కూడా చెప్పారు. ఇంధన సరఫరా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన అధికారులు దగ్గరగా పర్యవేక్షిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. హర్యానా, గోవా ముఖ్యమంత్రులు సహా పలువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు శర్మ వెల్లడించారు.
పానిక్ బుకింగ్ వద్దు..
ఎల్పీజీ సరఫరాపై మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగానే ఉందని తెలిపారు. అయితే వినియోగదారులు పానిక్ బుకింగ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నిన్న మాకు సుమారు 75 నుంచి 76 లక్షల ఎల్పీజీ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 88 లక్షలకు పెరిగింది. ఇది స్పష్టంగా పానిక్ బుకింగ్ వల్లే జరిగింది.. అని ఆమె తెలిపారు. అవసరం ఉన్నప్పుడే సిలిండర్ బుక్ చేయాలని పౌరులను కోరారు. ఎల్పీజీ కోసం అధికంగా పానిక్ బుకింగ్ జరుగుతోంది. నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బుకింగ్ చేయండి.. అని ఆమె స్పష్టం చేశారు. బుకింగ్‌పై ఉన్న పరిమితులు అలాగే కొనసాగుతున్నాయని కూడా ఆమె తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఒక బుకింగ్ తర్వాత మరో బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల విరామం, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల విరామం తప్పనిసరి అని చెప్పారు.
క్యూలలో నిలబడాల్సిన పనిలేదు..
ఎల్పీజీ బుకింగ్ కోసం వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదని కూడా శర్మ సూచించారు. బుకింగ్ విషయంలోనూ, సిలిండర్ల విషయంలోనూ ఎలాంటి భయాందోళనలు అవసరం లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంటికే సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి, ఇకముందూ అలాగే కొనసాగిస్తాయి.. అని ఆమె తెలిపారు. కమర్షియల్ వినియోగదారులకు సిలిండర్ల సరఫరాపై తీసుకునే నిర్ణయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి తీసుకుంటామని కూడా అధికారులు వెల్లడించారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు..
సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నామని కూడా అధికారులు వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో కూడిన సంయుక్త బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మార్చి 13, 2026న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా 1,300 కంటే ఎక్కువ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే 1,400 ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. అని ఓ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ తీసుకువస్తున్న రెండు భారత జెండా నౌకలు శనివారం ఉదయం యుద్ధ ప్రభావిత హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు.
భారత్‌కు చేరుకున్న రెండు ఎల్‌పీజీ నౌకలు..
శివాలిక్, నందాదేవి అనే ఎల్పీజీ క్యారియర్ నౌకలు ప్రస్తుతం గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు ప్రయాణిస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా మీడియాకు తెలిపారు. ఈ రెండు నౌకలు కలిపి 92,700 టన్నుల ఎల్పీజీ తీసుకువస్తున్నాయని, అవి మార్చి 16 లేదా 17 తేదీల్లో భారత పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ రెండు నౌకలు ఆ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమైన తర్వాత హోర్ముజ్ జలసంధి పశ్చిమ భాగంలో చిక్కుకుపోయిన 24 నౌకలలో భాగంగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, దేశవ్యాప్తంగా గృహాలకు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. ఆసుపత్రులు, విద్యాసంస్థలకు కూడా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతోందని పేర్కొంది. అదే సమయంలో గురువారం పార్లమెంట్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ ఇరాన్ వివాదం, హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు వచ్చినప్పటికీ భారత్ కు అవసరమైన ఇంధన సరఫరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చారు.












