
బాలీవుడ్లో ప్రస్తుతం కొనసాగుతున్న పీఆర్ కల్చర్ పై నటి అమీషా పటేల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం రెండు సినిమాలు చేసి, భారీ పీఆర్ ప్రచారంతో తమను నంబర్ వన్ స్టార్ లుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న యువ నటీమణులపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తే స్టార్ కాలేరు అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు వైరల్గా మారాయి. అమీషా పటేల్ తన పోస్టుల్లో నేటి బాలీవుడ్లో ఫేక్ పీఆర్ మెషినరీ పెరిగిపోయిందని ఆరోపించారు. భారీ బాక్సాఫీస్ హిట్స్ లేకపోయినా కొందరు నటీమణులు తమను నంబర్ 1, నంబర్ 2 స్టార్లుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా, ఆమె వ్యాఖ్యలు ప్రస్తుత తరం బాలీవుడ్ నటీమణులపైనే ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
రూ.100 కోట్లు పెద్ద లెక్క కాదు..
ఒక్క రూ.200 కోట్ల సినిమా కూడా లేని వారు సూపర్ స్టార్లమంటున్నారు. ఇది 2000 సంవత్సరం కాదు. ఇప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్లు పెద్ద విషయం కాదు.. అంటూ ఆమె వ్యాఖ్యానించారు. నిజమైన స్టార్డమ్ అనేది ప్రేక్షకుల ఆదరణ, చరిత్ర సృష్టించే బాక్సాఫీస్ విజయాలతో వస్తుందని, కేవలం మీడియా ప్రచారంతో రాదని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ను ఉదాహరణగా చూపిస్తూ కహో నా ప్యార్ హై, గదర్ వంటి సినిమాలు భారత సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయని అమీషా చెప్పారు. ప్రేక్షకుల ప్రేమతో వచ్చిన స్టార్డమ్కి పీఆర్ అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తన రాబోయే చిత్రం గదర్ 3 కూడా థియేటర్లలో సంచలనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏకీభవిస్తున్న నెటిజన్లు..
అమీషా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొంతమంది నెటిజన్లు ఆమె చెప్పింది నిజమేనని, ఇప్పుడు బాలీవుడ్లో పీఆర్ టీమ్లు ఇమేజ్ను కృత్రిమంగా నిర్మిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కాలం మారిందని, సోషల్ మీడియా, డిజిటల్ ప్రమోషన్లు ఇప్పుడు సినీ రంగంలో భాగమైపోయాయని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దర్శకుడు కరణ్ జోహార్ కూడా బాలీవుడ్లో పెయిడ్ పీఆర్ సంస్కృతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. నటీనటుల విజయాలు సహజంగానే మాట్లాడాలని, ప్రజలను డబ్బు పెట్టి ఆకట్టుకునే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

స్పందించండి