
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానం అందించారు. అంతకు ముందు కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు పలువురు ఇతర కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ నాయకులను కూడా వారు తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు. కాగా విజయ్-రష్మిక వివాహం గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ఉన్న ఐటీసీ మెమొంటో హోటల్‌లో ఘనంగా జరిగింది. ఇద్దరూ తమ తమ ఆచారాల ప్రకారం రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. అలాగే తమ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లోనూ వేర్వేరుగా పోస్టులు పెట్టి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుచుకున్నారు.
రష్మిక నా స్నేహితురాలు: విజయ్
విజయ్ దేవరకొండ తెలంగాణ వాసికాగా రష్మికతో ఆయన వివాహం ఉదయం ఆ సంప్రదాయంలో జరిగింది. అనంతరం సాయంత్రం రష్మిక సంప్రదాయ పద్ధతి కొడగు సంప్రదాయంలో వీరు మళ్లీ వివాహం చేసుకున్నారు. ఇక వివాహ రిసెప్షన్‌ను వీరు హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాత్రం అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ పోస్టులో స్పందిస్తూ రష్మిక పక్కన ఉంటే ఎలాంటి ఆందోళన ఉండదని, ఆమె తన పట్ల స్నేహితురాలిలా వ్యవహరిస్తుందని, అందుకనే ఆమెను వివాహం చేసుకున్నానని తెలిపాడు.
విజయ్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు: రష్మిక
రష్మిక మందన్న కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లిపై స్పందించింది. తనకు నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేర్పిన వ్యక్తి విజయ్ అని తెలిపింది. విజయ్ వల్ల ప్రశాంతత పరిచయం అయిందని, కలలు కనడం, లక్ష్యాలను సాధించడం, గొప్పగా ఉండడం తనకు చెప్పిన వ్యక్తి విజయ్ అని కొనియాడింది. తన విజయాలను గుర్తు చేసుకుంటూ వాటి వెనుక విజయ్ ఉన్నాడని తెలిపింది. అతని గురించి ఒక పుస్తకమే రాయవచ్చని స్పష్టం చేసింది. కాగా ఈ ఇద్దరి మధ్య గీత గోవిందం సినిమా సమయంలో ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. కానీ వీరు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పే వరకు వీరి రిలేషన్ షిప్ గురించి ఎక్కడా బయటకు చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. కాగా విజయ్, రష్మిక జంటకు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.












