
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ ఎట్టకేలకు పాన్ ఇండియా వైడ్‌గా విడుదలవుతుండడంతో ఇప్పుడు ఈ సినిమాపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే పెద్ది చిత్ర షూటింగ్ సమయంలో చరణ్ చేతికి ఏర్పడిన గాయం కారణంగా ఆయన త్వరలో సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్రను పెద్ది చిత్రంలో పోషించినట్లు సమాచారం. సినిమా షూటింగ్ సమయంలో పలు యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న రామ్ చరణ్ పలుమార్లు గాయపడినా, ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా చిత్రీకరణను కొనసాగించినట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్‌లలో తీవ్ర శారీరక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, అంకితభావంతో షూటింగ్‌ను పూర్తి చేశారని చిత్ర బృందం ప్రశంసించింది. ఇటీవల పెద్ది ప్రమోషన్లలో రామ్ చరణ్ చేతికి రిస్ట్ బ్యాండ్‌తో కనిపించారు. దీనిపై స్పందించిన ఆయన, షూటింగ్ చివరి రోజుల్లో ఒక యాక్షన్ స్టంట్ చేస్తుండగా చేతికి గాయం అయినట్లు వెల్లడించారు.
సినిమా విడుదల తరువాతే సర్జరీ..?
చేతిలో ఏర్పడిన టియర్ కారణంగా రామ్ చరణ్ త్వరలో సర్జరీ చేయించుకోనున్నారని సమాచారం. అయితే పెద్ది సినిమా ప్రమోషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సర్జరీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన వెంటనే ఆయనకు కొంత విరామం లభించనుండటంతో అప్పుడే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకోనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పూర్తిగా పెద్ది ప్రమోషన్లపైనే దృష్టి సారించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించగా, హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటించారు.
అభిమానుల్లో భారీ అంచనాలు..
పెద్ది చిత్రంపై వాస్తవానికి అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి చివరి వారంలోనే విడుదల కావల్సి ఉన్నా కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉండడంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఓ దశలో ముందుగా ప్రకటించిన జూన్ 4వ తేదీన కూడా సినిమా రిలీజ్ అవుతుందా, లేదా అన్న సందేహాలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టింది. అదే తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసింది. పెద్ది చిత్రంలో చరణ్ పలు క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుడిగా కనిపించనున్నట్లు చిత్ర పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. అయితే పెద్ది సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
గమనిక (Disclaimer): ఈ వార్త కేవలం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడినది. నటుడు రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితి, సర్జరీకి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాల కోసం చిత్ర యూనిట్ లేదా వారి ప్రతినిధుల ప్రకటనలను గమనించగలరు.













