
తాను సినిమాల్లోకి కావాలని రాలేదని, యాదృచ్ఛికంగానే జరిగిందని, అయినప్పటికీ ప్రేక్షకులు తనను ఆదరించారని, ఆ క్రమంలోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని నటుడు నాగార్జున అన్నారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యం, కెరీర్, సినిమా వైపు ప్రయాణం, సక్సెస్, ప్రస్తుత పరిస్థితులు వంటి అనేక అంశాలపై మాట్లాడారు. ఇటీవలి కాలంలో నాగార్జునకు హిట్స్ లేవు. సోగ్గాడు సినిమాలు తప్ప ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు భారీ హిట్ అయిన దాఖలాలు లేవు. ఇక ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో ద్వారా బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన తమిళ నటుడు ధనుష్‌తో కలిసి చేసిన కుబేరుడు సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన మల్టీ స్టారర్ చిత్రాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాను చిన్నప్పుడు యావరేజ్ విద్యార్థిని అని, చదువులపై అంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేదని చెప్పారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో నాగేశ్వర్ రావు కుమారుడిగా తనను ప్రేక్షకులు భావించారని, కానీ తన తండ్రికి భిన్నంగా నటిస్తూ విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం మారిందని, బాక్సాఫీస్ గణాంకాలతో తనకు సంబంధం లేదని, తనకు నచ్చిన సినిమా చేస్తే వచ్చే సంతృప్తి వేరే అని అన్నారు.
వ్యాపారం చేద్దామని ఇండియాకు వచ్చి..
బాల్యంలో తనకు 3 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే హైదరాబాద్‌కు వచ్చినట్లు నాగార్జున తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం కొనసాగిందని, హీరో కొడుకుని కనక తనపై ప్రత్యేక శ్రద్ధ ఎవరూ పెట్టలేదని చెప్పారు. చదువుల్లో యావరేజ్ అని, ఎల్లప్పుడూ తొలి 20 ర్యాంకుల్లో నిలిచేవాడినని తెలిపారు. అయితే 5వ తరగతి చదువుతున్న సమయంలో ఒకసారి డ్రామాలో మహిళ వేషం వేశానని, దాన్ని చూసి అందరూ ఎగతాళి చేశారని, ఆ తరువాత భయంతో డ్రామాల జోలికి వెళ్లలేదని తెలిపారు. ఇక సుడిగుండాలు అనే సినిమాలో 30 సెకన్ల పాటు కనిపించే చిన్న పాత్రలో నటించానని, అదే మొదటి సారి మేకప్ వేసుకోవడమని తెలిపారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక దాదాపు ఏడాదిన్నర పాటు అమెరికాలో ఉన్నానని, జీవితంలో సెటిల్ అవడం గురించి ఆ సమయంలో పెద్దగా ఆలోచించలేదని చెప్పారు. అయితే ఇండియాకు వచ్చి ఏదైనా వ్యాపారం చేద్దామని తిరిగి వచ్చేశానని, కానీ అప్పట్లో ఇండియాలో వ్యాపారం చేయాలంటే కనీసం ఏడాది వరకు లైసెన్స్ వచ్చేది కాదని, దీంతో ఆ రంగంలోకి వద్దనుకుని ఫిలిం ప్రొడక్షన్‌లోకి వచ్చినట్లు వివరించారు. ఆ తరువాత తన కెరీర్ పూర్తిగా మలుపు తిరిగిందని అన్నారు.
సోదరుడి సూచన మేరకు..
తన సోదరుడు ఒకసారి తనను సినిమాల్లో నటించమని కోరాడని, ఆలోచిస్తే తనకు కూడా అదే కరెక్ట్ అనిపించిందని, వెంటనే సినిమాల్లో యాక్ట్ చేయడం ప్రారంభించానని నాగార్జున తెలిపారు. అదే క్రమంలో తాను హీరోగా వచ్చిన మొదటి సినిమా విక్రమ్ అని, అది 1986లో రిలీజ్ అయిందని అన్నారు. అప్పట్లో అది భారీ హిట్ అయిందని, అయితే హీరో కొడుకు అన్న ముద్ర వేశారని, నాగేశ్వర్ రావు పాపులారిటీతో ఆ మూవీ హిట్ అయిందని కొందరు తనను విమర్శించారని అన్నారు. అయినప్పటికీ తాను ఆ విమర్శలను పట్టించుకోకుండా కెరీర్‌లో ముందుకు సాగి ప్రస్తుతంఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. నెమ్మదిగా తనను విమర్శించిన వారే తరువాత తన సినిమాలు హిట్ అయ్యే సరికి ఆశ్చర్యపోయారని తెలిపారు. ప్రస్తుతం చాలా మంది సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్ లెక్కలను చూస్తున్నారని, కానీ తాను వాటిని పట్టించుకోనని, తనకు నచ్చిన సినిమా చేస్తే సంతృప్తిగా ఉంటుందని, అది చాలని స్పష్టం చేశారు. కాగా నాగార్జున సోలో హీరోగా నటించిన బంగార్రాజు చిత్రం 2022లో రిలీజ్ కాగా ఈ మూవీ హిట్ టాక్ సాధించింది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మల్టీ స్టారర్ గా చేసిన కుబేరుడు మాత్రం హిట్ అయింది. ప్రస్తుతం ఆయన లెనిన్ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది ఈ ఏడాది విడుదల కానుంది.













