
బుచ్చిబాబు దర్శకత్వంలో తాను చేసిన పెద్ది మూవీపై ఎంతో మనసు పెట్టి చేశానని, ఈ సినిమా తన కెరీర్ లో ఎప్పటికీ నంబర్ 1 గా నిలుస్తుందని నటుడు రామ్ చరణ్ అన్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా చరణ్ కలసి నటిస్తున్న పెద్ది మూవీ జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. మరోవైపు ఐపీఎల్ సీజన్ కూడా ముగుస్తుండడంతో చివరి మ్యాచ్‌లను లక్ష్యంగా చేసుకుని చిత్ర యూనిట్ ఇప్పటికే స్టేడియంలలో ఫ్యాన్స్‌ను ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించగా అందులో చరణ్, జాన్వీ సహా చిత్రయూనిట్ సభ్యులు, పలువురు నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ పెద్ది సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ప్రేక్షకుల స్థానం పెద్దది..
తనకు హిందీ పరిజ్ఞానం కాస్త తక్కువేనని రామ్ చరణ్ తెలిపారు. కానీ ప్రేక్షకులకు మాత్రం తన గుండెల్లో ఉన్న స్థానం చాలా పెద్దదని అన్నారు. భాషను కాకుండా తన భావనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని, జూన్ 4న ప్రేక్షకుల హృదయాల్లో పెద్దికి కాస్త చోటు ఇవ్వాలని కోరారు. ఇది క్రీడా నేపథ్యంతో సాగే కథ అని, ఒక వ్యక్తి జీవితంలో చేసే ప్రయాణమని తెలిపారు. పెద్ది అందరినీ నవ్విస్తాడని, స్ఫూర్తి నింపుతాడని స్పష్టం చేశారు. ఈ సినిమా చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాకు మూల స్తంభం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని, దర్శకుడు బుచ్చిబాబు సహా చిత్ర యూనిట్ అంతా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడుతూనే ఉందని తెలిపారు. ఈ సినిమా కోసం అనుక్షణం శ్రమించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ నుంచి తనపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.
యువతను ఉత్తేజ పరిచే చిత్రం..
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ ప్రతి ఫ్రేమ్‌లోనూ రామ్‌చరణ్ 100 శాతం ఉంటారని తెలిపారు. ఆయన నటన, డ్యాన్స్‌తో తన పాటలకు మరింత వన్నె తెచ్చారని, అన్నింటికన్నా ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే పాటలంటే తనకు బాగా ఇష్టమని అన్నారు. మ్యూజిక్, పాటలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని స్పష్టం చేశారు. నటుడు రవికిషన్ మాట్లాడుతూ ప్రస్తుతం యువత డ్రగ్స్, మత్తుకు అలవాటు పడుతుందన్నారు. కానీ పెద్ది అసలైన యువత లక్ష్యాలను చూపిస్తుందని, క్రికెట్, కుస్తీ ఇలా చాలా క్రీడలు ఉన్నాయని, త్రీ ఇడియట్స్, దంగల్‌లా పెద్ది గురించి కూడా మాట్లాడుకుంటారని అన్నారు. యువతను ఉత్తేజ పరిచే చిత్రమిదని, ఈ కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని అన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక పెద్ది అసలైన హీరోలా కనిపిస్తాడని, కుటుంబంతో కలిసి ఈ మూవీని చూడాలని కోరారు. క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరని, రామ్‌చరణ్ నటన అందరినీ కట్టి పడేస్తుందని స్పష్టం చేశారు. జాతీయ అవార్డు సహా అన్నీ పెద్దికి రావడం ఖాయమని అన్నారు.













