
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా మారి సేవలు అందిస్తానని, జట్టును విజయం కోసం అవసరం అయితే చివరి ఓవర్ వరకు తీసుకెళ్తానని ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. లక్నో సూపర్ జయాంట్స్ (ఎల్ఎస్జీ)తో లక్నోలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో జడేజా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ముఖ్యమైన వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోవడమే కాక, లక్నో ఇన్నింగ్స్‌లోనూ కీలక వికెట్ తీసి తమ జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో జడేజా తన ఫుల్ కోటా బౌలింగ్‌ను పూర్తి చేయలేదు. దీనిపై కామెంటేటర్లు అడిగిన ప్రశ్నలకు జడేజా స్పందించాడు. జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని, జట్టు ఎలా తనను ఉపయోగించుకోవాలని చూస్తుందో తాను కూడా అలాగే సేవలు అందిస్తానని, ఫుల్ కోటా బౌలింగ్ చేయనంత మాత్రాన తనను జట్టు తక్కువ చేసి చూస్తున్నట్లు కాదని స్పష్టం చేశాడు.
చెన్నైలో కీలక ప్లేయర్‌గా సేవలు..
గత ఐపీఎల్ సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా ఫ్రాంచైజీల ట్రేడ్‌లో భాగంగా రాజస్థాన్‌కు మారిన విషయం తెలిసిందే. చెన్నై జట్టు రాజస్థాన్ కెప్టెన్‌గా కొనసాగుతున్న సంజు శాంసన్‌ను తీసుకుని బదులుగా తమ టీంలో ఉన్న జడేజా, శామ్ కర్రన్‌లను రాజస్థాన్‌కు ఇచ్చింది. అయితే జడేజా తన ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో రాజస్థాన్‌కు ఆడడం విశేషం. దీంతో తాను మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నట్లు ఉందని ఈ సీజన్ ప్రారంభంలో జడేజా తెలిపాడు. ఇక చెన్నై టీంలో ఆడినప్పుడు జడేజా కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. ఆ జట్టు ఐపీఎల్ టైటిల్స్‌ను నెగ్గడంలో జడేజా కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఒకానొక దశలో చెన్నైకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక వెంటనే తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు రాజస్థాన్ జట్టులో ఆల్ రౌండర్‌గా తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు.
ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయం..
ఇక లక్నోతో జరిగిన తాజా మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో కీలక వికెట్లను కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా, మిడిలార్డర్లో వచ్చిన జడేజా తన బ్యాటింగ్‌తో అజేయంగా నిలిచి జట్టును ఆదుకున్నాడు. మరో ప్లేయర్ డోనోవాన్ ఫెరిరాతో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు హిట్మైర్తోనూ పార్ట్నర్షిప్ నెలకొల్పిన జడేజా ఫెరిరాతో కలిసి లక్నోపై విరుచుకు పడ్డాడు. తమ జట్టు డిఫెండబుల్ స్కోర్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మొత్తం 29 బంతులు ఆడిన జడేజా 1 సిక్సర్, 2 ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. అయితే పిచ్‌కు బౌలింగ్‌కు బాగా అనుకూలంగా ఉండడంతో దాన్ని తప్పుగా అంచనా వేసిన లక్నో ప్లేయర్లు కుదురుగా ఆడాల్సిందిపోయి పేలవమైన షాట్లతో వికెట్లను సమర్పించుకున్నారు. కెప్టెన్ పంత్ కూడా మరోసారి చెత్త షాట్‌తో నిరాశ పరిచాడు. ఇక రాజస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు సైకిల్ స్టాండ్‌ను తలపించేలా వికెట్లను కోల్పోయింది. 18 ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 41 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 55 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి తోటి ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. దీంతో రాజస్థాన్ చేతిలో లక్నో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.












