ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఆర్థిక పరిమితులేనని ఆయన వెల్లడించారు.

April 14, 2026 5:35 PM
Abhishek Bachchan talking about IPL team ownership and financial budget.
ఐపీఎల్ ఫ్రాంచైజీల ధరలు తన స్తోమతకు మించినవని వెల్లడించిన నటుడు అభిషేక్ బచ్చన్. Photo Credit: Abhishek Bachchan/Instagram.

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఆర్థిక పరిమితులేనని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయడం చాలా ఖరీదైన వ్యవహారమని ఆయన తెలిపారు. అభిషేక్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల ఫోర్బ్స్‌తో మాట్లాడుతూ ఐపీఎల్ జ‌ట్టును కొనుగోలు చేయ‌డం అన్న విష‌యం చాలా ఆస‌క్తిక‌ర‌మైంద‌ని అన్నారు. ఐపీఎల్‌ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తార‌ని, క్రీడ‌ల వినోదంలో అత్యుత్త‌మ లీగ్ అని అన్నారు. ఐపీఎల్ జ‌ట్టును తాను కూడా కొనాల‌ని అనుకున్నాన‌ని, అయితే అప్ప‌ట్లో తాను కెరీర్ ప్రారంభించిన న‌టున్న‌ని, అందువ‌ల్ల త‌న‌కు స‌రైన ఆదాయం లేద‌ని, దాని వ‌ల్లే ఐపీఎల్ జ‌ట్టును కొనుగోలు చేయ‌లేక‌పోయాన‌ని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల ధ‌ర‌లు భారీగా ఉన్నందున ఇప్ప‌టి బ‌డ్జెట్ కూడా త‌న‌కు స‌హ‌క‌రించ‌ద‌ని తెలిపారు. ఐపీఎల్ జ‌ట్టును ఇప్పుడు కొనుగోలు చేయ‌డం త‌న సామ‌ర్థ్యానికి మించిన ప‌ని అని అన్నారు.

అప్ప‌ట్లో నాకు అర్థం కాలేదు: అభిషేక్ బ‌చ్చ‌న్

కాగా 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సమయానికి అభిషేక్ బచ్చన్ ధూమ్‌, ధూమ్ 2, ఎల్‌వోసీ కార్గిల్‌, గురు వంటి సినిమాలతో సినీ పరిశ్రమలో తన స్థానం ఏర్పరుచుకుంటున్న దశలో ఉన్నారు. తాను ఐపీఎల్‌లో ఏ విధంగా సహకరించగలనో కూడా అప్పట్లో స్పష్టంగా తెలియలేదని ఆయన అన్నారు. ఇంకా ముఖ్యంగా తాను ఆటకు ఏం విలువ చేర్చగలనో అర్థం కాలేద‌ని, మౌలిక వసతుల విషయంలో బీసీసీఐ అద్భుతంగా పని చేస్తోంద‌ని, తాను ఏం చేయగలనో తెలియ‌డం లేద‌ని అన్నారు. కేవలం స్టాండ్స్‌లో కూర్చొని చేతులు ఊపే వ్యక్తిని కాద‌ని ఆయన పేర్కొన్నారు. తనకు జట్టు నిర్వహణలో ఎంతో వ్యక్తిగత ప్రమేయం ఉంటుందని కూడా అభిషేక్ వివరించారు. ఆటగాళ్లతో కలిసి కూర్చుంటాన‌ని, వాళ్లతోనే జీవిస్తాన‌ని, అవసరమైతే శిక్షణ ఇస్తాన‌ని అన్నారు. వారు రోజూ ఏం తింటారో కూడా తానే నిర్ణయిస్తాన‌ని, ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పర్యవేక్షిస్తాన‌ని, అదే త‌న‌ పని విధానం అని చెప్పారు.

ఇత‌ర క్రీడ‌ల ఫ్రాంచైజీల‌తో స‌క్సెస్‌..

అభిషేక్ బ‌చ్చ‌న్ ఐపీఎల్ జ‌ట్టును కొన‌లేక‌పోయినా ఇత‌ర క్రీడ‌ల‌కు చెందిన జ‌ట్ల‌ను మాత్రం కొనుగోలు చేసి విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. 2014 ఏప్రిల్‌లో జైపూర్ పింక్ పాంథ‌ర్స్ జట్టును కొనుగోలు చేయడంతోపాటు అదే ఏడాది ఆగస్టులో చెన్న‌యిన్ ఎఫ్‌సీ కి సహ యజమానిగా మారారు. క్రికెట్ విషయానికి వస్తే అప్పట్లో తనకు ఆ క్రీడపై సరైన అవగాహన లేదని ఆయన ఒప్పుకున్నారు. ఇప్పటిలా కాకుండా అప్పట్లో క్రికెట్‌పై త‌న‌కు అంతగా అవగాహన లేద‌ని, ఇతర క్రీడలపై ఎక్కువ పరిజ్ఞానం ఉండేద‌ని తెలిపారు. అందుకే తాను ఎలా సహాయం చేయగలనో అర్థం కాలేద‌ని, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేర‌ని అన్నారు. ఇక అభిషేక్ బచ్చన్ ఇటీవ‌ల బీ హ్యాప్పీ అనే చిత్రంలో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment