
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్లలో మార్చి 19, 2026న రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విజయాన్ని సాధించలేకపోయింది. ప్రారంభంలో ఓపెనింగ్స్ ఉన్నా తరువాత డీలా పడి చివరకు నష్టాలను మిగిల్చింది. అయితే నెల తిరగకుండానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఏప్రిల్ 16, 2026న స్ట్రీమ్ కానుంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూడవచ్చు. భారతీయ సినీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు పలు భాషలతోపాటు ఇంగ్లిష్‌లోనూ సబ్ టైటిల్స్‌ను అందివ్వనున్నారు. దీంతో సినిమాకు రీచ్ ఎక్కువ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
ఓపెనింగ్స్ బాగున్నా..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సమయంలో భారీ హైప్‌ను సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ధురంధర్ 2తో పోటీ పడుతుందని భావించారు. కానీ విడుదలైన నాలుగైదు రోజుల వరకు కలెక్షన్లను బాగానే సాధించినా తరువాత పూర్తిగా తగ్గిపోయాయి. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆరంభంలో కలెక్షన్లను సాధించినా తరువాత వెనుకబడింది. దీంతో మేకర్స్‌కు భారీగా నష్టాలు వచ్చినట్లు సమాచారం. అయితే సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ అప్పీల్ ఈ సినిమాలో బాగున్నప్పటికీ, కథ, కథనంపై ప్రేక్షకులు పెదవి విరిచారు. థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికపై విడుదల కానుంది.
వివరాలను వెల్లడించిన నెట్ ఫ్లిక్స్..
ఏప్రిల్ 16, 2026 నుంచి తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ తమ సోషల్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. సినిమాలోని ఓ ప్రసిద్ధ డైలాగ్‌ను వినోదాత్మకంగా ప్రస్తావిస్తూ విడుదల తేదీని వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, ఆయనతో కలిసి గతంలో పవన్ గబ్బర్ సింగ్ సినిమా చేశారు. ఇప్పుడిది వీరి కాంబోలో రెండో సినిమా. గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించినా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం నిరాశపరిచింది. ఇక ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నటులు శ్రీలీల, రాశి ఖన్నా యాక్ట్ చేయగా, పార్థిబన్, రావు రమేష్, కేఎస్ రవికుమార్ కీలకపాత్రల్లో నటించారు. వీకెండ్‌లో మంచి వినోదం కావాలని చూస్తున్న వారు ఈ మూవీని ఒకసారి వీక్షించవచ్చు.












