
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు చేరుకునే వరకు పోటీ మరింత తీవ్రతరం అవుతుందని టీమిండియా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. లక్నో సూపర్ జయాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఆ మ్యాచ్ స్లో పిచ్ కారణంగా చాలా నెమ్మదిగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ప్లేయర్లు బ్యాటింగ్‌లో తడబడ్డారు. దీంతో తమ ముందు లక్నో నిలిపిన 147 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో ఛేదించింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి అంతకు ముందు ఫీల్డింగ్ సమయంలో గ్రౌండ్‌లో కనిపించలేదు. దీంతో అతను మ్యాచ్‌లో ఆడతాడా, లేదా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేశారు. అయితే ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ కోహ్లిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపింది. దీంతో కోహ్లి నేరుగా బెంగళూరు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే వచ్చాడు. అయితే కోహ్లి అలా ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడం వెనుక బలమైన కారణమే ఉంది.
కోహ్లి అందుకనే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు..
ఏప్రిల్ 12, 2026న ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఆతిథ్య జట్టుతో జరిగిన ఐపీఎల్ 2026 టోర్నీ 20వ మ్యాచ్‌లో కోహ్లి గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు భారీ స్కోరు చేసి విజయం సాధించింది. అయితే కోహ్లి మోకాలికి గాయమై నొప్పి వచ్చింది. దీంతో అతను మ్యాచ్ సమయంలో ఇబ్బంది పడ్డాడు. అయితే తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అతని నొప్పి తగ్గలేదు. అందువల్ల అతను ఫీల్డింగ్‌కు రాలేకపోయాడు. దీంతో కోహ్లిని ఆర్‌సీబీ జట్టు మేనేజ్‌మెంట్ బ్యాటర్‌గా ఉపయోగించుకోవాలనుకుంది. అందులో భాగంగానే కోహ్లిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా నేరుగా బ్యాటింగ్‌లోనే బరిలోకి దింపారు. అందువల్లే కోహ్లి అంతకు ముందు బెంగళూరు ఫీల్డింగ్‌లో మైదానంలో కనిపించలేదు. ఈ విషయాలను కోహ్లి మ్యాచ్ అనంతరం స్వయంగా వెల్లడించాడు. అయితే తన ప్రదర్శనతోపాటు రానున్న ఐపీఎల్ మ్యాచ్‌లపైనా అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మరింత తీవ్రతరం కానున్న ఐపీఎల్ పోరు..
ఆర్‌సీబీ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో తాను ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేదనే అనుకుంటున్నానని కోహ్లి తెలిపాడు. కానీ లక్నోతో జరిగిన ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అయితే టీ20 క్రికెట్ ఎప్పటికప్పుడు మారుతుందని, అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నాడు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పిచ్ స్లో గా ఉందని కోహ్లి అంగీకరించాడు. అందుకనే తాము టాస్ గెలిచిన అనంతరం ఫీల్డింగ్ తీసుకున్నామని, తాము ఊహించినట్లే పిచ్ స్లోగా ఉందని నిర్దారణ అయిందని, అయితే లక్ష్యాన్ని ఛేదించాలంటే సరైన ఆరంభం ముఖ్యం కనుక, స్లో పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని పవర్ ప్లే లోనే అధిక పరుగులు రాబట్టాలని నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. తాము నిర్ణయించుకున్న ప్లాన్‌ను 100 శాతం విజయవంతంగా అమలు చేశామని, దీంతో వికెట్లు కోల్పోయినా తరువాత వచ్చిన బ్యాటర్స్ స్వేచ్ఛగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారని తెలిపాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, ముందు ముందు పోరు మరింత తీవ్రతరం అవుతుందని, అందువల్ల తన బ్యాటింగ్‌ను ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందని కోహ్లి పేర్కొన్నాడు.












