
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్ తరచూ ఓ అప్ డేట్ ను అందిస్తూ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు. వారణాసి చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలతోపాటు బిహైంద్ ది సీన్స్ (బీటీఎస్) వీడియోలను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఎక్స్‌క్లూజివ్ గా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్తికేయ హాజరు కానుండగా, దర్శకుడు రాజమౌళి మాత్రం ప్రత్యేక వీడియో మెసేజ్‌ను అక్కడి అభిమానులను ఉద్దేశించి ఇవ్వనున్నారు.
మెక్సికోలో కంటెంట్ ప్రదర్శన..
రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కార్తికేయ అందించిన ఈ అప్‌డేట్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సంతోషాన్ని నింపింది. కాగా మెక్సికోలో కామిక్ కాన్ ఎక్స్‌పీరియెన్స్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నిర్మాత కార్తికేయ పాల్గొంటారు. ప్రదర్శనలో వారణాసి మూవీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను ప్రదర్శించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలు, బీటీఎస్ దృశ్యాలతోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలతో కూడిన గ్లింప్స్‌ను కూడా ప్రేక్షకులకు చూపించనున్నారు. అయితే ఆ సీన్లు, వీడియోలు అన్నీ భారత ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటాయా, లేక అక్కడి ప్రేక్షకులకే వాటిని పరిమితం చేస్తారా.. అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
అత్యున్నత సాంకేతిక విలువలతో..
ఇక వారణాసి చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్‌ను కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటేలా ఈ సినిమాను రాజమౌళి అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లతో మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే బాక్సాఫీస్ వద్ద చిత్రం ఎలాంటి సంచలన విజయాన్ని సాధిస్తుందో చూడాలి.












