
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం తప్పకుండా ఉంటుందని నటుడు యష్ తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు ఆ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాయి. కేజీఎఫ్ రెండు చిత్రాలతో కన్నడ చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. దీంతో కేజీఎఫ్ 3 కోసం యష్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు యష్ ఎవరైనా ఒకరు ఈ మూడో భాగంపై అప్‌డేట్ ఇస్తారని ఆశిస్తున్నారు. అయితే యష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కేజీఎఫ్ 3 ఉంటుందని, కానీ అందుకు సమయం పడుతుందని, ప్రస్తుతం తనకు ఉన్న ప్రాజెక్టులే అందుకు కారణమని తెలిపారు. అయితే కేజీఎఫ్ 3 ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు షూటింగ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అన్న వివరాలపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
హర్షం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..
ఇక యష్ నటించిన కేజీఎఫ్ 1 సినిమా 2018 డిసెంబర్ 21న రిలీజ్ అయి నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయిలో బంపర్ హిట్ సాధించింది. యష్ నటన మాత్రమే కాకుండా, దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లను వసూలు చేసింది. భారత్‌లో ఈ మూవీ రూ.240 కోట్లను వసూలు చేయగా, విదేశాల్లో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఇక కేజీఎఫ్ 2 సినిమా 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాగా ఈ మూవీని రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారత్‌లో ఈ మూవీ రూ.960 కోట్లను వసూలు చేయగా, విదేశీ మార్కెట్‌లో రూ.206 కోట్లను మొత్తం కలిపి రూ.1166 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. కేవలం కర్ణాటకలోనే రూ.170 కోట్లు వసూలు చేయగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.147 కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ రెండు సినిమాల్లోనూ యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. అయితే కేజీఎఫ్ 3 సినిమా ఉంటుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చినా సరే సినిమా అయితే వస్తోంది కదా అని ఖుషీగా ఫీలవుతున్నారు.
పలు ప్రాజెక్టుల్లో బిజీ..
ఇక యష్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన టాక్సిక్ సినిమా మార్చిలోనే రిలీజ్ కావల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు జూన్ 4, 2026న రిలీజ్ చేస్తామని ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ రెండు భాగాల్లో యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌లలో రానుండగా, మొదటి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్‌ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ అనంతరం ప్రభాస్‌తో కలిసి సలార్ తీసి హిట్ కొట్టగా ప్రస్తుతం ఆయన ఎన్‌టీఆర్ హీరోగా ఓ పవర్‌ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఆ తరువాతే కేజీఎఫ్ 3 ఉంటుందని తెలుస్తోంది.












