
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు అడివి శేష్ అన్నారు. ఆయన హీరోగా నటించిన డెకాయిట్ సినిమా ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మూవీ ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో డెకాయిట్ మూవీ థాంక్యూ మీట్‌ను నిర్వహించగా అందులో పాల్గొన్న శేష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తమిళనాడు నుంచి వచ్చిన ఓ అభిమాని తనతో చెప్పిన మాటలు తనను ఎంతగానో ప్రేరణ కలిగించాయని, సినిమాల కోసం తాను ఇంకా కష్టపడాలని అప్పుడే తనకు అనిపించిందని శేష్ అన్నారు. అలాగే ఈ మూవీ గురించి నటుడు రామ్ చరణ్ పెట్టిన పోస్టును కూడా శేష్ ప్రస్తావించారు.
సినిమాల కోసం ఇంకా కష్టపడాలి..
తమిళనాడు నుంచి వచ్చిన ఓ అభిమాని ఇటీవల తనను కలిసినప్పుడు తాను అంతకు ముందు నటించిన మేజర్ మూవీని ఆ అభిమాని చూసినట్లు తెలిపాడని అన్నారు. అప్పట్లో అతను గాయాలకు గురై హాస్పిటల్‌లో చేరాడని, కొందరు అతనిపై దాడులకు పాల్పడ్డారని, బయటకు వెళ్లాలంటే భయమేసిందని ఆ అభిమాని చెప్పాడని శేష్ తెలిపారు. అయితే శేష్ నటించిన మేజర్ సినిమా చూసిన తరువాత అతనికి ధైర్యం వచ్చిందని తనకు చెప్పాడని శేష్ అన్నారు. ఆ తరువాత ఆ అభిమాని ధైర్యంగా జీవిస్తున్న విషయాన్ని తనకు తెలియజేశాడని అన్నారు. ఆ అభిమాని తనతో తన సినిమాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడని, అయితే ఆ క్షణమే తనకు సినిమాలను అసలు ఎందుకు చేస్తున్నానని తట్టిందని, సినిమాల గురించి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానని అన్నారు.
సినిమా నచ్చకపోతే పక్కన పెడుతున్నారు..
ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని, సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారని, అయితే సినిమా నచ్చితే నటీనటుల గురించి పట్టించుకోవడం లేదని, ఎంత సీనియర్ నటుల సినిమాలు అయినా సరే నచ్చకపోతే పక్కన పెట్టేస్తున్నారని శేష్ అన్నారు. అలాగే సినిమా రిలీజ్ సమయంలో నటుడు రామ్ చరణ్ తన మూవీ గురించి పెట్టిన పోస్టు చూసి షాకయ్యానని, ఆయన తమ సినిమా చూసి బాగుందని తెలిపారని అన్నారు. తమ సినిమాను ఆదరించిన ఆడియన్స్, మీడియా, ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శేష్ పేర్కొన్నారు.












