
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కుల్దీప్ యాదవ్ వివాహం మార్చి 14, 2026న ఉత్తరాఖండ్‌లోని ముస్సూరీలో జరిగింది. ఆ వివాహానికి కేవలం కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. లక్నోలోని ది సెంట్రమ్ వేదికగా నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి సహచర క్రికెటర్లతోపాటు పలువురు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇక రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో కలిసి పాల్గొని నూతన దంపతులను వేదికపై ఆశీర్వదించగా ఆ దృశ్యాలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా దంపతుల కాళ్లకు నమస్కారం చేస్తూ కనిపించాడు. దీంతో కుల్దీప్ సంస్కారానికి ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కుల్దీప్ యాదవ్‌పై నెటిజన్ల ప్రశంసలు..
కుల్దీప్ యాదవ్ వివాహం, రిసెప్షన్‌కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కానీ రవీంద్ర జడేజా దంపతులకు అతను పాదాభివందనం చేసిన వీడియో మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. వాస్తవానికి రవీంద్ర జడేజా వయస్సులో పెద్దవాడు. కనుక అతని కాళ్లకు, అతని భార్య పాదాలకు నమస్కారం చేయాలి. దాన్నే కుల్దీప్ పాటించాడు. దీంతో కుల్దీప్ చేసిన చర్యకు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సంప్రదాయాలను గౌరవించడంపై కుల్దీప్ను ప్రశంసిస్తున్నారు. ఇక ఈ రిసెప్షన్ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తోటి క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్, మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్ తదితరులు హాజరయ్యారు.
Kuldeep Yadav touched the feet of Rivaba and Ravindra Jadeja.
The way Rivaba blessed Kuldeep was heartwarming 🤌❤️ pic.twitter.com/FGwsl6nH1r
— Tejash (@Tejashyyyyy) March 18, 2026
శిఖర్ ధావన్ ప్రత్యేక శుభాకాంక్షలు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిఖర్ ధావన్ కుల్దీప్ యాదవ్ రిసెప్షన్‌కు తాను హాజరైన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా నూతన దంపతులకు ధావన్ సోషల్ మీడియా వేదికగా కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవలే శిఖర్ ధావన్ కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అతను సోఫీ షైన్ అనే విదేశీ యువతిని వివాహం చేసుకోగా ఆమెతోపాటు కుల్దీప్ యాదవ్ రిసెప్షన్‌కు హాజరయ్యాడు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తాను పెట్టిన ఫొటోలకు ధావన్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్, వంశికాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, ఇద్దరూ జీవితాంతం ప్రేమగా, ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని ధావన్ తెలిపాడు.
పురాతన రోల్స్-రాయ్స్ కారులో వేదిక వద్దకు..
కాగా కుల్దీప్ యాదవ్ భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. కానీ అతను మ్యాచ్‌లు ఆడలేదు. ఇక రిసెప్షన్ వేడుకకు అతను క్లాసిక్ బ్లాక్ సూట్ ధరించగా, వంశికా క్రీమ్ రంగు చీర కట్టుకుంది. ఈ ఇద్దరూ పురాతన రోల్స్-రాయ్స్ కారులో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, రాష్ట్ర మంత్రి ఏ.కే. శర్మ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.












