ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది.

March 9, 2026 5:34 PM
IPL 2026 official start date announced by Star Sports.
మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ ఎడిషన్. Photo Credit: BCCI/RCB/X.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు ఈ ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకునే కొన్ని గంటల ముందు స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ తేదీని ప్రకటించింది. అయితే టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు. వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల తేదీలపై స్పష్టత కోసం బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి ఎదురుచూస్తున్నాయి. గత సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ హోం గ్రౌండ్ అయిన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియానికి తిరిగి రానుంది. గత సీజన్ ఫైనల్లో ఆర్‌సీబీ పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

చిన్న‌స్వామి స్టేడియంలో 5 మ్యాచ్‌లు..

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) కార్యదర్శి సంతోష్ మెనన్ మాట్లాడుతూ లీగ్ దశలో ఆర్‌సీబీ తమ 7 హోం మ్యాచ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతుందని స్పష్టం చేశారు. మిగతా 2 మ్యాచ్‌లు ఛత్తీస్‌గఢ్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. అయితే గతంలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ హోం మ్యాచ్‌లు జరగడంపై అనిశ్చితి నెలకొంది. 2025 జూన్ 4న ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ఏర్పడిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన స్టేడియంలో పెద్ద ఎత్తున జనసమ్మేళనాలు నిర్వహించే సదుపాయాలపై సందేహాలను కలిగించింది. దాంతో కొంతకాలం పాటు స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడంపై తాత్కాలిక నిషేధం విధించబడింది. అలాగే ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు కూడా ఇతర వేదికలకు మార్చబడ్డాయి.

ష‌ర‌తుల‌తో అనుమ‌తులు..

అయితే జనవరి 17, 2026న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అన్ని నిబంధనలను కేఎస్‌సీఏ, ఆర్‌సీబీ పాటించాలనే షరతుతో ఈ అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులో మ్యాచ్‌ల నిర్వహణకు సహకరించిన కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, కర్ణాటక పోలీసులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.. అని ఫ్రాంచైజీ విడుదల చేసిన ఒక‌ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ సీజన్‌కు ముందు మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను మెరుగుపర్చేందుకు చేసిన సంయుక్త కృషి వల్ల డిఫెండింగ్ చాంపియన్లు తమ హోం గ్రౌండ్‌లోనే ఎక్కువ భాగం హోం మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది.. అని ఆ ప్రకటనలో మరోసారి స్పష్టం చేసింది.

మే 31న ఫైన‌ల్‌..?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కూడా గత ఏడాది మాదిరిగానే అదే ఫార్మాట్‌లో జరగనుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు లీగ్ దశలో తలా 14 మ్యాచ్‌లు ఆడతాయి. అనంతరం టాప్ 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఈసారి టోర్నమెంట్ ఫైన‌ల్‌ను మే 31, 2026న నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌రో వారం రోజుల్లో టోర్నీ షెడ్యూల్‌పై స్ప‌ష్ట‌త రానుంద‌ని స‌మాచారం. కానీ ముందుగా కొన్ని రోజుల వ‌ర‌కే షెడ్యూల్‌ను రిలీజ్ చేస్తార‌ని, ఆ త‌రువాత మిగిలిన రోజుల‌కు షెడ్యూల్ విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment