ఆదివారం, జూలై 19, 2026
భార‌త‌దేశం

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల రీచార్జ్ ప్లాన్ పేరుతో వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల విధానంలో మార్పులు రావాలని కోరిన ఎంపీ రాఘవ్ చద్దా. Photo Credit: Raghav Chadha/X.
AAP MP Raghav Chadha raising prepaid recharge issues in Rajya Sabha.
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల విధానంలో మార్పులు రావాలని కోరిన ఎంపీ రాఘవ్ చద్దా. Photo Credit: Raghav Chadha/X.

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల రీచార్జ్ ప్లాన్ పేరుతో వినియోగదారులను దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేత అయిన రాఘవ్ చద్దా, భారతదేశంలోని 125 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లేనని తెలిపారు. అందువల్ల టెలికాం సంస్థలు అనుసరిస్తున్న విధానంలో పారదర్శకత ఉండాలని ఆయన కోరారు. పార్లమెంట్‌లో కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన రాఘవ్ చద్దా, ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ముగిసిన తర్వాత కూడా ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఎక్కువ కాలం చెల్లుబాటు కల్పించాలని కోరారు. అదేవిధంగా మొబైల్ నంబర్ డీయాక్టివేషన్ గడువును కూడా పొడిగించాలని సూచించారు.

ఏడాదికి 13 సార్లు రీచార్జి..

మీ రీచార్జ్ ముగిసిన తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేయడం సహజమే. కానీ ఇన్‌కమింగ్ కాల్స్‌ను కూడా బ్లాక్ చేయడం అన్యాయంగా ఉంటుంది. రీచార్జ్ గడువు ముగిసిన వెంటనే ఎవరూ మీతో సంప్రదించలేరు. అలాగే ఓటీపీ వంటి ముఖ్యమైన సందేశాలు కూడా మీ ఫోన్‌కు చేరవు. అత్యవసర పరిస్థితుల్లో ఆ వ్యక్తి పూర్తిగా నిస్స‌హాయంగా మారుతాడు.. అని ఆయన అన్నారు. టెలికాం కంపెనీలు అమలు చేస్తున్న 28 రోజుల రీచార్జ్ ప్లాన్ కారణంగా వినియోగదారులు ప్రతి ఏడాది ఒక అదనపు నెలకు చెల్లించాల్సి వస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. 28 రోజుల రీచార్జ్ ప్లాన్ ఒక మోసం. సంవత్సరంలో 12 నెలలు ఉన్నా, మీరు 13 సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తుంది. 28 రోజులు × 13 సార్లు అంటే 364 రోజులు అవుతుంద‌ని ఆయన పార్లమెంట్‌లో చెప్పారు.

నెల‌కు 28 కాదు, 30 లేదా 31 క‌దా..

రీచార్జ్ ప్లాన్ చెల్లుబాటు కాలాన్ని క్యాలెండర్ నెలల ఆధారంగా అంటే 30 లేదా 31 రోజులుగా నిర్ణయించాలి. ఎందుకంటే ఈ 28 రోజుల వ్యవస్థ వల్ల ప్రజలు సంవత్సరంలో ఒక అదనపు రీచార్జ్ చేయాల్సి వస్తోంది.. అని ఆయన అన్నారు. వినియోగదారుల తరఫున కొన్ని డిమాండ్లను కూడా ఆయన ప్రస్తావించారు. చివరి రీచార్జ్ తర్వాత కూడా ఎస్‌ఎంఎస్ సేవలు, ఇన్‌కమింగ్ కాల్స్‌ను ఒక సంవత్సరం వరకు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి కాలంలో మొబైల్ ఫోన్ విలాస వస్తువు కాదు. ఇది సాధారణ ప్రజలకు అవసరమైన సాధనంగా మారింది. అందువల్ల టెలికాం కంపెనీలు వినియోగదారులతో న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరించాలి.. అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి