
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం లేదా ఊబకాయం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఫ్యాటీ లివర్ వచ్చేందుకు కారణం అవుతున్నాయి. దీని వల్ల లివర్ పనితీరు దెబ్బ తింటోంది. దీర్ఘకాలంలో ఇది ఫ్యాటీ లివర్‌కు కారణం అవుతోంది. అయితే చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉందని కూడా తెలియడం లేదు. శరీరం అందుకు తగిన లక్షణాలను కూడా చూపించడం లేదు. ఈ క్రమంలోనే పలు రకాల పోషకాహారాలను తీసుకోవడం వల్ల లివర్ పనితీరును మెరుగు పడేలా చేయవచ్చని, లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుందని, మెటబాలిక్ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, ఎయిమ్స్, హార్వార్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో శిక్షణ పొందిన డాక్టర్ సౌరభ్ సేథి తెలిపారు. యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల లివర్‌ను సంరక్షించుకోవచ్చని సూచించారు. ఈ మేరరకు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరాలను వెల్లడించారు. లివర్ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారాలను ఆయన తెలియజేశారు.
ఫ్యాటీ లివర్ రెండు రకాలు..
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటని డాక్టర్ సేథి తెలిపారు. మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు, విష పదార్థాలను లివర్ ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంది. మెటబాలిజం సరిగ్గా ఉండేలా చూస్తుంది. పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. అయితే మనం పాటించే జీవనశైలితోపాటు ఆయా కారణాల వల్ల లివర్‌లో కొవ్వు అధికంగా చేరుతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాగా ఇది మద్యం అధికంగా సేవించే వారిలో లివర్‌లో కొవ్వు అధికంగా చేరడం వల్ల వస్తుంది. ఇక రెండోది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD). మద్యం సేవించకపోయినా అస్తవ్యస్తమైన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల వల్ల ఇది వస్తుంది. ప్రస్తుతం ఈ సమస్యతోనే అధిక శాతం మంది బాధపడుతున్నారు. అయితే ఫ్యాటీ లివర్ సమస్య ఏ కారణాలతో వచ్చినా లివర్ మాత్రం వాపులకు గురవుతుంది. కనుక ఈ రెండు వ్యాధుల్లోనూ ఆహారాన్ని ఒకే రకంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లివర్‌లో ఉండే కొవ్వు కరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే లివర్ పనితీరు మెరుగు పడుతుంది. దీర్ఘకాలంలో లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చని డాక్టర్ సేథి చెప్పారు.
లక్షణాలు లేకుండానే అటాక్..
ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వస్తుందని డాక్టర్ సేథి తెలిపారు. కానీ ఈ వ్యాధి వచ్చాక జీవనశైలితోపాటు ఆహారం, మందుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీంతో వ్యాధి నుంచి మరింత మెరుగ్గా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ క్రమంలోనే యాంటీ ఆక్సిడెంట్లతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేటరీ సమ్మేళనాలు ఉండే ఆహారాలను తీసుకోవాలని, ఇవి లివర్ కణాలను రక్షించడంతోపాటు లివర్‌లో ఉండే వ్యర్థాలను సులభంగా బయటకు పంపుతాయని తెలిపారు. లివర్‌ను రక్షించే ఆహారాల్లో మొదటి విభాగం కింద ఆయన పలు ఆహారాలను సూచించారు. వాటిల్లో ఆరోగ్యకరమైన పానీయాలు అయిన బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, మచా టీ వంటివి ఉన్నాయి. ఇవి కేవలం పానీయాలు మాత్రమే కాదని, శరీరానికి శక్తిని అందజేస్తాయని, వీటిల్లో అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని, ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అందిస్తాయని తెలిపారు.
బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ..
- డాక్టర్ సేథి తెలిపిన ప్రకారం బ్లాక్ కాఫీలో కెఫీన్, క్లోరోజెనిక్ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్‌ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో లివర్ ఫైబ్రోసిస్ ను అడ్డుకోవచ్చు. తరచూ బ్లాక్ కాఫీని ఆహారంలో భాగం చేసుకుంటే ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం నుంచి బయట పడవచ్చు.
- గ్రీన్ టీ, మచా టీలలో కాటెకిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఒక రకానికి చెందిన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలపై ఇవి నేరుగా ప్రభావం చూపిస్తాయి. కొవ్వు కరిగేలా చేస్తాయి. దీంతో లివర్ ఉన్న కొవ్వు సైతం కరిగిపోతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగు పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
- బ్లాక్ టీలో పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి లివర్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, వాపుల నుంచి రక్షిస్తాయి.
డాక్టర్ సేథి తెలిపిన ప్రకారం ఆయా పానీయాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల లివర్‌కు ఎంతో మేలు జరుగుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఆయా పానీయాలను చక్కెర, క్రీమ్ కలపకుండా తాగాల్సి ఉంటుందని ఆయన సూచించారు.
పసుపు..
డాక్టర్ సేథి తెలిపిన తదుపరి ఆహారాల జాబితాలో పసుపు కూడా ఒకటి. దీన్ని ఆయుర్వేదంతోపాటు సంప్రదాయ వైద్య విధానంలో గోల్డెన్ స్పైస్‌గా ఉపయోగిస్తున్నారు. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పసుపు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధారణంగా వాపులు అధికం కావడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పసుపులో ఉండే కర్క్యుమిన్ ఆక్సీకరణ ఒత్తిడితోపాటు వాపులను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల లివర్‌లో ఉండే కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. రోజూ అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ మోతాదులో పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే మేలు పొందవచ్చని డాక్టర్ సేథి తెలిపారు. పసుపును రోజూ మీరు తినే కూరలు, తాగే సూప్ లు స్మూతీలు, వేడి పాలు వంటి ఆహారాల్లో కలిపి తీసుకోవచ్చని అన్నారు. అయితే పసుపును నేరుగా తీసుకుంటే అందులో ఉండే కర్క్యుమిన్ను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కనుక పసుపుతోపాటు మిరియాల పొడిని కూడా కలిపి తీసుకుంటే మేలు జరుగుతుంది, దీంతో పసుపులో ఉండే కర్క్యుమిన్ను శరీరం సరిగ్గా శోషించుకుంటుందని ఆయన తెలిపారు.
బెర్రీలు, బ్రోకలీ, బీట్ రూట్..
లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆహారాల్లో బెర్రీ పండ్లు, బ్రోకలీ, బీట్ రూట్ కూడా ముఖ్యమైనవే అని డాక్టర్ సేథి తెలిపారు. ఈ వృక్ష సంబంధ ఆహారాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పెద్ద మొత్తంలో ఉంటాయని, ఇవి లివర్‌ను రక్షిస్తాయని అన్నారు.
- బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీలలో ఆంథో సయనిన్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌లో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో లివర్ ఆక్సీకరణ నష్టానికి గురవకుండా ఉంటుంది.
- బ్రోకలీలో ఫైబర్, సల్ఫోరాఫేన్ అధికంగా ఉంటాయి. ఇవి లివర్‌ను డిటాక్స్ చేసే ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీంతో లివర్ మరింత మెరుగ్గా టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
- బీట్ రూట్లో బీటాలెయిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వృక్ష సంబంధ పిగ్మెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి.
డాక్టర్ సేథి తెలిపిన ప్రకారం ఈ మూడు రకాల Bలను (బెర్రీలు, బ్రోకలీ, బీట్స్) ఆహారంలో భాగం చేసుకుంటే లివర్‌కు దీర్ఘకాలం పాటు రక్షణ లభిస్తుంది. అలాగే మెటబాలిక్ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఈ ఆహారాలు ఆయన తెలిపిన ఆహారాల చివరి జాబితాలో ఉన్నాయి.
ఈ జాగ్రత్తలను కూడా పాటించాలి..
డాక్టర్ సేథి చెప్పినట్లుగా ఈ మూడు రకాల గ్రూపులకు చెందిన ఆహారాలు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. అయితే దీంతోపాటు ఇతర పోషకాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు ఉండే ఆహారాన్ని వేళకు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. బరువు నియంత్రణలో ఉండాలి. మద్యం సేవించడం మానేయాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి, లేదా మానేయాలి. లేదంటే ఇవన్నీ ఫ్యాటీ లివర్ సమస్యను అధికం చేస్తాయని ఆయన తెలిపారు. ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందికి ఎలాంటి లక్షణాలను చూపించదు. సైలెంట్‌గా అటాక్ అవుతుంది. దీని వల్ల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో చాలా ప్రభావం పడుతుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉండే ఆహారాలను (బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, పసుపు, బెర్రీలు, బ్రోకలీ, బీట్ రూట్) తరచూ తీసుకోవడం వల్ల లివర్‌లో కొవ్వు చేరకుండా రక్షిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీర్ఘకాలంలో లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. కనుక ఆయా ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ సేథి సూచించారు.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. వ్యాధి నిర్దారణ, చికిత్స, వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏ సమస్య ఉన్నా లేదా వైద్య సలహా కోసం అయినా సరే వైద్యులనే సంప్రదించాల్సి ఉంటుంది.








