
వీధి కుక్కలపై సానుభూతి చూపించాలని మాట్లాడినందుకు తనను ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోలో మాట్లాడారు. వీధి కుక్కలను పెద్ద సంఖ్యలో చంపుతున్నారని కొందరు ఎన్‌జీవోలు తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డారని, వారి విజ్ఞప్తితో తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని, అందుకు తనను చాలా మంది తిడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్కలను చంపేందుకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని చెప్పానని, అందుకని అప్పటి నుంచి తనపై ట్రోలింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఎంతో ఆవేదన చెందాల్సి వస్తుందని అన్నారు.
వీధి కుక్కలు ఉంటే ఎమ్మెల్యేకు చెప్పండి: రేణు దేశాయ్
తనపై కొందరు ఇప్పటికీ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని రేణు దేశాయ్ అన్నారు. తనపై ఇంత ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. 2012లో తనకు పవన్ కల్యాణ్‌తో విడాకులు అయినప్పటి నుంచి తనపై రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారని, భరణం తీసుకున్నానని, రాజకీయ పార్టీకి బానిసనని ఇలా రకరకాలుగా తిడుతున్నారని చెప్పారు. 100 వీధి కుక్కల్లో 10 పిచ్చి కుక్కలు ఉంటాయని, వాటి కోసం మిగిలిన 90 కుక్కలను చంపడం సరికాదని చెప్పానని, అయినా వీధి కుక్కల సమస్య ఉంటే లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్‌లకు చెప్పాలి కానీ తనను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కామెంట్లు పెడుతుండడం బాధగా ఉందని చెప్పారు. తన యాక్టింగ్ బాగాలేకపోతే చెప్పాలని, కానీ తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయవద్దని హెచ్చరించారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో తనను బూతులు తిడుతున్న వారు ఒకసారి తమ మనస్సాక్షిని తాము ప్రశ్నించుకోవాలని రేణు దేశాయ్ అన్నారు. వారికి ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి లేరా అని ప్రశ్నించారు. కొందరు సోషల్ మీడియాలో మరీ నీచంగా కామెంట్లు పెడుతున్నారని, ఇది ఎక్కడి సంస్కారమో తనకు అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి కామెంట్లను సహించబోనని, కామెంట్లు చేసేవారు ఎక్కడ ఉన్నా సరే వారి ఇంటికి వెళ్లి ఆ కామెంట్లను వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకు చూపిస్తానని స్పష్టం చేశారు.












