
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బంపర్ న్యూస్. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ముందుగా అనుకున్న తేదీ కన్నా ఒక వారం ముందుగానే థియేటర్లలోకి వస్తోందని, ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026కు బదులుగా మార్చి 19, 2026న సినిమాను రిలీజ్ చేస్తున్నామని, బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఫ్యాన్స్ భారీ ఎత్తున సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అలాగే తాజాగా థమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవడంపైనా క్లారిటీ ఇచ్చారు.
థమన్‌ను అందుకనే తీసుకున్నాం: మైత్రి మూవీ మేకర్స్
ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన దేఖ్‌లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్‌లకు భారీ ఎత్తున స్పందన లభిస్తోందని మైత్రి మూవీ మేకర్స్ తన ప్రకటనలో తెలిపింది. ఈ సినిమా మ్యూజిక్‌ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వెల్లడించింది. అయితే రిలీజ్ తేదీని ముందుకు జరపడం వల్ల మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం కష్టంగా మారిందని, ఆయనకు షెడ్యూల్ వీలు కావడం లేదని, కనుక థమన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మేకర్స్ స్పష్టం చేశారు. రిలీజ్ డేట్‌ను దృష్టిలో ఉంచుకుని అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఆదరిస్తారన్న నమ్మకం తమకు ఉందని, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కారణంగా సినిమాకు మరింత బూస్ట్ లభిస్తుందని పేర్కొన్నారు. సినిమా మ్యూజిక్, సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని తెలిపారు.
ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పాటలను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూ త్వరలోనే మరో పాటను కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ పాటకు కూడా భారీ ఎత్తున స్పందన లభిస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు. రాక్‌స్టార్ డీఎస్‌పీ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ మరోమారు సూపర్ హిట్ పాటలను ఫ్యాన్స్‌కు అందిస్తుందని అన్నారు. కాగా ఇటీవలే యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాను వార్ క్రైసిస్ కారణంగా జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ చెప్పిన తేదీ కన్నా ఇంకా ముందుకు జరగడం విశేషం. అయితే ఈ నిర్ణయం పట్ల సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా అనుకున్న తేదీ కన్నా వారం ముందుగానే వస్తుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.












