
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న శంకర్‌పల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో కల్కి 2 చిత్ర షూటింగ్‌ను మేకర్స్ ప్రారంభించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్ట్ లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతోపాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనె, దిశా పఠాని వంటి అగ్ర నటీనటులు మొదటి పార్ట్‌లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. 2024లో విడుదలైన కల్కి మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. భారీ ఎత్తున కలెక్షన్స్‌ను సాధించింది. తరువాత సరిగ్గా 20 నెలలకు ఇప్పుడు సెకండర్ పార్ట్ షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు.
కొన్ని రోజుల తరువాతే ప్రభాస్..?
కల్కి 2 చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్‌తోపాటు తమిళ ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ అంతకు ముందు పోషించిన అశ్వత్థామ రోల్‌లో మళ్లీ ఇప్పుడు కొనసాగనుండగా, కమల్ యథావిధిగా సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించనున్నారు. ఇక షెడ్యూల్‌లో కొన్ని రోజుల అనంతరం షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
దీపికా స్థానంలో ఎవరు..?
కల్కి 2 చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగంలో బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనె సుమతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె సీక్వెల్‌లో నటించడం లేదని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆమె స్థానంలో చిత్ర యూనిట్ ఎవరిని తీసుకుంటుంది అని ఇప్పటికే అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ దశలో ఈ పాత్రకు అనేక మంది పేర్లు వినిపించగా, రీసెంట్‌గా వచ్చిన వార్తల ప్రకారం సుమతి పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీనిపై మేకర్స్ గోప్యతను పాటిస్తూ చివరి వరకు సస్పెన్స్ ఉంచి ఆ తరువాత దాన్ని సినిమా హైప్ కోసం వాడుతారా, లేక భవిష్యత్తులో ఈ పాత్ర చేయబోయే నటి ఎవరన్నది వెల్లడిస్తారా.. అన్న విషయం తెలియాల్సి ఉంది.












