
హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ హీరో ప్రభాస్ అన్నారు. సంతోష్ శోభన్, మానసా వారణాసి, కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడారు. తన ఆహారపు అలవాట్లతోపాటు గతంలో పలు సినిమాల షూటింగ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆయన వివరించారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు చీట్ డే గా ప్రకటించి, ఈ రోజు ఎవరూ భోజనం చేయకండి, నేను ప్రత్యేకంగా చెన్నై ఫుడ్ అరేంజ్ చేస్తున్నాను అని టీమ్‌కు చెప్పారు. అయితే ఎంత సేపు వెయిట్ చేసినా భోజనం రాలేదు.
ఇంటర్‌స్టేట్ ఫుడ్ డెలివరీ..
గంటల తరబడి వేచి చూసినా భోజనం రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆలస్యం ఎందుకని అడిగితే, ప్రభాస్ మాట్లాడుతూ, ఆహారం చెన్నై నుంచి వస్తోందని చెప్పడంతో అందరూ షాకయ్యారు. ముంబైలోనే ఉన్న ఏదైనా తమిళ స్టైల్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి, చెన్నై నుంచి ఓ వ్యక్తి విమానం ఎక్కి, ప్రత్యేకంగా ఆహారం తీసుకొచ్చాడని తెలిసి టీమ్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ ఇంటర్‌స్టేట్ ఫుడ్ డెలివరీని గుర్తు చేసుకుంటూ ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. ఇక ప్రభాస్ తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అలాగే చెన్నై బిర్యానీలో ఉండే కాస్త పుల్లని రుచులు తనకు ఇంకా బాగా నచ్చుతాయని కూడా వెల్లడించారు.
కాగా ప్రభాస్ భోజన ప్రియుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన సినిమా షూటింగ్‌ల సమయంలో ఇంటి నుంచే స్వయంగా వంటకాలను సిద్ధం చేసి మరీ సెట్లకు తీసుకు వస్తుంటారు. ఈ విషయాన్ని గతంలో ఎన్నో సార్లు సహ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా వెల్లడించారు. ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ తరువాతే ఎవరైనా అని కూడా చెబుతుంటారు. అయితే తాజాగా ప్రభాస్ చెప్పిన విషయాలు మళ్లీ ఆయన అతిథి మర్యాదలను గుర్తు చేస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.












