
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి Strict Account Settings (స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్) అని పేరు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా అకౌంట్‌ను హ్యాకింగ్, సైబర్ మోసాలు, ఫిషింగ్ లింకులు, అనుమానాస్పద కాల్స్ నుంచి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మీడియా ఫైళ్లు, అటాచ్‌మెంట్లు, లింకులను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసే విధంగా ఇది పనిచేస్తుంది.
మెటా సంస్థ తెలిపిన ప్రకారం ఇటీవల లింకులు, APK ఫైల్స్, నకిలీ మెసేజ్‌ల ద్వారా మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను రూపొందించారు. స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఫీచర్‌లో పలు ముఖ్యమైన భద్రతా అంశాలను అందిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. అనుమానాస్పద మీడియా ఫైల్స్, అటాచ్‌మెంట్స్ ను ఆటోమేటిక్‌గా నిరోధిస్తుంది. పరిచయం లేని కాంటాక్ట్స్ పంపే లింకుల ప్రివ్యూ (preview) కనిపించకుండా చేస్తుంది. హ్యాకింగ్ ప్రయత్నాలను ముందే అడ్డుకునేలా అదనపు భద్రతా లేయర్‌గా పనిచేస్తుంది.
ఈ ఫీచర్‌ను మెటా లాక్‌డౌన్ స్టైల్ సెక్యూరిటీగా అభివర్ణించింది. ముఖ్యంగా జర్నలిస్టులు, కార్యకర్తలు, ప్రముఖ వ్యక్తులు వంటి హై-రిస్క్ యూజర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ఒక్క క్లిక్‌తో స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఎలా ఆన్ చేయాలి?
- వాట్సాప్ వినియోగదారులు ఈ ఫీచర్‌ను చాలా సులభంగా ఆన్ చేసుకోవచ్చు.
- WhatsApp ఓపెన్ చేయండి.
- Settings లోకి వెళ్లండి.
- అక్కడ నుంచి Privacy ఎంచుకోండి.
- తరువాత Advanced ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
- చివర్లో కనిపించే Turn On Strict Account Settings ఎంపికను క్లిక్ చేయండి.
- ఇంతటితో మీ అకౌంట్‌కు అదనపు భద్రతా కవచం యాక్టివ్ అవుతుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు అదనపు రక్షణ..
ఇప్పటికే వాట్సాప్‌లో అన్ని మెసేజీలు End-to-End Encryption తో భద్రంగా ఉంటాయని మెటా చెబుతోంది. అయితే తాజా స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్ ఫీచర్ ద్వారా ఆ భద్రతకు మరో పొరను జోడించినట్టయింది. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న తరుణంలో, ఈ ఫీచర్ కోట్లాది మంది వినియోగదారులకు పెద్ద ఊరటగా మారనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








