సూర్య ఇన్నింగ్స్‌కు సెహ్వాగ్ ఫిదా.. టీమిండియా స్టార్‌పై ప్రశంసల జల్లు!

భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆడిన మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను మాజీ భారత ఓపెనర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తారు.

February 8, 2026 10:15 PM
Suryakumar Yadav batting during the match against USA and Sehwag's reaction.
యూఎస్ఏపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్యపై సెహ్వాగ్ ప్రశంసలు. Photo Credit: ICC/Virender Sehwag/X.

భారత్-యూఎస్‌ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ ఆడిన మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను మాజీ భారత ఓపెనర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో సూర్యకుమార్ సంయమనం, దూకుడు రెండూ కలిసిన బ్యాటింగ్ కీలకంగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. స్కోరు 77 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఆ సమయంలో మ్యాచ్ దిశ పూర్తిగా మారే ప్రమాదం కనిపించినా, సూర్యకుమార్ మాత్రం ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడాడు. 49 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అత‌ని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ కీలక ప్రదర్శనతో భారత్ 20 ఓవర్లలో 161/9 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేరుకుంది.

సూర్య కెరీర్‌లోనే అత్యుత్త‌మ ఇన్నింగ్స్ ఇది..

ఈ ఇన్నింగ్స్‌పై స్పందించిన సెహ్వాగ్, మ్యాచ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇది సూర్యకుమార్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా అభివర్ణించారు. ఒకవేళ భారత్ 100 పరుగులకే ఆలౌట్ అయి ఉంటే, యూఎస్‌ఏ భారత్‌ను ఓడించిందని మనం అనేవాళ్లం కాదు. వాళ్లూ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన జట్టే. అందుకే ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింద‌ని అన్నారు. బ్యాటింగ్ తత్వంపై కూడా సెహ్వాగ్ వ్యాఖ్య‌లు చేశారు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే-బౌలర్‌ని కాదు, బంతినే గమనించాలి. సరైన లెంగ్త్‌లో పడితే గౌరవించాలి. మంచి బంతిపై షాట్‌కు వెళ్తే ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుంద‌ని సూచించారు. అలాగే యూఎస్‌ఏ బౌలర్ల ప్రదర్శనను కూడా సెహ్వాగ్ ప్రశంసించారు. ఈ యూఎస్‌ఏ జట్టులోని కొందరు బౌలర్ల గురించి మనకు పెద్దగా తెలియదు. అయినా భారత్‌ను 77/6కి కుదించగలిగారు. గత రెండేళ్లలో ఇలాంటి పరిస్థితిని మరే జట్టు సృష్టించలేదేమో. కాబట్టి సూర్యకుమార్‌కు హ్యాట్సాఫ్, అద్భుతంగా ఆడాడు.. అని అన్నారు.

ఆక‌ట్టుకున్న భార‌త బౌల‌ర్లు..

భారత్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిష‌న్‌, తిల‌క్ వ‌ర్మ కూడా వేగంగా పరుగులు చేసి మద్దతిచ్చారు. యూఎస్‌ఏ తరఫున షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌, హ‌ర్మీత్ సింగ్ బంతితో ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ 132/8 పరుగులకే పరిమితమైంది. మిలింద్ కుమార్‌, సంజ‌య్ కృష్ణ‌మూర్తి, శుభం రంజనె పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత్ తరఫున మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష‌దీప్ సింగ్ కీలక వికెట్లు తీసి విజయాన్ని ఖాయం చేశారు. ఈ విజయంతో వరల్డ్‌కప్‌ను గెలుపుతో ప్రారంభించిన భారత్‌కు, కెప్టెన్ సూర్యకుమార్ ఇన్నింగ్స్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment