ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ స‌మావేశం నిర్వ‌హించింది. ఇందులో 10 జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్ల‌తోపాటు ప‌లువురు అంపైర్లు, మ్యాచ్ రిఫ‌రీలు పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అమ‌లు చేయ‌నున్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వారు కెప్టెన్ల‌కు వివ‌రించారు.

March 26, 2026 10:40 PM
IPL 2026 captains meeting at BCCI headquarters in Mumbai.
ఐపీఎల్ 2026 నిబంధనలపై ముంబైలో జరిగిన ప్రీ-సీజన్ సమావేశంలో చర్చిస్తున్న కెప్టెన్లు. Photo Credit: BCCI.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ స‌మావేశం నిర్వ‌హించింది. ఇందులో 10 జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్ల‌తోపాటు ప‌లువురు అంపైర్లు, మ్యాచ్ రిఫ‌రీలు పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అమ‌లు చేయ‌నున్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వారు కెప్టెన్ల‌కు వివ‌రించారు. ఐపీఎల్ 2026 రూల్స్ ను తెలియ‌జేశారు. క్యాచ్‌ల‌ను ప‌ట్టుకోవ‌డం, పూర్తి చేయ‌డం, ప్లేయింగ్ కండిష‌న్లు, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌, 60 సెక‌న్ల టైమ‌ర్‌, కోడ్ ఆఫ్ కండ‌క్ట్ వంటి ప‌లు నియ‌మాల‌ను వారు కెప్టెన్ల‌కు వివ‌రించారు.

క్యాచ్‌లు ప‌ట్టే విష‌యంలో మ‌రింత స్ప‌ష్ట‌త‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభానికి ముందు బీసీసీఐ టీమ్‌ల‌కు చెందిన కెప్టెన్‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డం అభిమానుల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అంపైర్లు ఈ స‌మావేశంలో కీల‌క నిబంధ‌న‌ల‌ను కెప్టెన్‌ల‌కు విడ‌మరిచి చెప్పారు. 10 జ‌ట్ల కెప్టెన్‌ల‌కు క్యాచ్‌ల చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై అంపైర్లు అవ‌గాహన క‌ల్పించ‌డంతోపాటు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అందించారు. ఫీల్డ‌ర్ బంతిని పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి తీసుకోవ‌డంపాటు త‌న శ‌రీరంపై కూడా పూర్తి స్థాయి నియంత్ర‌ణ సాధించిన త‌రువాతే క్యాచ్‌ను చెల్లుబాటుగా ప‌రిగ‌ణిస్తార‌ని జ‌ట్ల కెప్టెన్ల‌కు తెలిపారు.

కెప్టెన్ల‌కు వీడియోల ప్ర‌ద‌ర్శ‌న‌..

ఈ స‌మావేశంలో అంపైర్ నితిన్ మీన‌న్‌, మ్యాచ్ రిఫ‌రీ జ‌వ‌గ‌ల్ శ్రీ‌నాథ్ పాల్గొని ప‌లు నియమాల‌ను కూలంక‌షంగా వివ‌రించారు. మొత్తం 90 నిమిషాల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో ఈసారి కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న ప‌లు రూల్స్‌ను కూడా వారు కెప్టెన్‌ల‌కు వివ‌రించారు. బీసీసీఐ సైతం ఈ నియమాల ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్పింది. క్లాజ్ 33.3 ప్ర‌కారం క్యాచ్ చేసే చ‌ర్య బంతి మొద‌టిసారి ఫీల్డ‌ర్ శ‌రీరాన్ని తాకిన క్ష‌ణం నుంచి ప్రారంభ‌మై, ఫీల్డ‌ర్ బంతిపై, త‌న క‌ద‌లిక‌ల‌పై పూర్తి నియంత్ర‌ణ సాధించే వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని బీసీసీఐ తెలియ‌జేసింది. క్యాచ్‌ల చ‌ట్ట‌బ‌ద్ద‌త‌ను మ‌రింత స్ప‌ష్టంగా అర్థం అయ్యేలా అధికారులు ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 నుంచి ప‌లు వీడియో క్లిప్‌ల‌ను కెప్టెన్‌ల‌కు చూపించారు.

10 జ‌ట్ల కెప్టెన్‌లు హాజ‌రు..

ఐపీఎల్ 2026 కెప్టెన్ల స‌మావేశానికి 10 ఫ్రాంచైజీల‌కు చెందిన కెప్టెన్లు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో కొత్త సీజ‌న్‌కు సంబంధించిన కీల‌క ప్లేయింగ్ కండిష‌న్లు, నిబంధ‌న‌ల వివ‌ర‌ణ‌లు, ఆప‌రేష‌న‌ల్‌ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ‌మ‌న్ గిల్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్‌, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌ అజింక్య రహానే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో గిల్ మాట్లాడుతూ ఈ స‌మావేశం చ‌క్క‌గా ఉంద‌ని, అనేక రూల్స్‌ను క్షుణ్ణంగా తెలుసుకున్నామ‌ని పేర్కొన్నాడు.

ఈ అంశాల‌పైనా చ‌ర్చ‌..

ఈ స‌మావేశంలో ఇన్నింగ్స్ టైమర్ (60 సెకండ్ల క్లాక్), ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన, కన్కషన్ సబ్‌స్టిట్యూట్ ప్రోటోకాల్, కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి పలు కీలక అంశాల‌ను చ‌ర్చించారు. ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు నిర్వహించే ఈ సమావేశం టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జట్ల నాయకులకు నిబంధనలపై స్పష్టత, ఏకరీతి అవగాహన కల్పించే సంప్రదాయ కార్యక్రమంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే కెప్టెన్ల‌కు అనేక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment